అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతాయ్

  •  దోపిడీ రాజ్యం కూలిపోతుంది
  •  రేపల్లె, గుడివాడలో పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి- యంత్రాంగం :‘వచ్చే ఎన్నికల్లో కూటమిదే అధికారం… దోపిడీ రాజ్యం కూలిపోతుంది.. అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతారు’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. బాపట్ల జిల్లా రేపల్లె, కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అతలాకుతలం చేశారని ఆరోపించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో జనం ఆస్తులు దోచుకునేందుకు జగన్‌ సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే జనం ఆస్తులను తాకట్టు పెట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల ఆస్తి హక్కును హరించే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ప్రజలందరూ ఓటు ద్వారా వ్యతిరేకించాలని, ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలంటే వైసిపిని చిత్తుగా ఓడించాలని కోరారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే నా సొంత రక్తాన్నైనా ఎదిరిస్తానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఒక స్థాయి వరకు ప్రజలు మౌనంగా ఉంటారని, తర్వాత పిల్లల నుంచి పెద్దలు, మహిళలు సైతం తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. భవన కార్మికుల సంక్షేమ నిధి రూ.450 కోట్లను జగన్‌ ప్రభుత్వం దోచుకుందని, మేం రాగానే తిరిగి ఆ నిధిని అందుబాటులోకి తెస్తామని, ఆ నిధికి నేను కోటి రూపాయలు విరాళంగా అందిస్తానని చెప్పారు. దుర్భాషలాడే వైసిపి నేతలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. 2019లో ఓటు వేస్తే మద్యం తీసివేస్తామని, సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. వైసిపి ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఏడువేల పైచిలుకు ఎయిడెడ్‌ విద్యా సంస్థలు మూతపడ్డాయని చెప్పారు. కాల్వల్లో పూడిక తీయకపోవడం వల్ల పంటలకు సాగునీరందక రైతులు క్రాపు హాలిడే ప్రకటించేలా ఉన్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని, ఆక్వారంగానికి పెద్ద పీటవేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్‌టిఆర్‌ హెల్త్‌ వర్సిటీకి పేరును మార్పు చేసి వైఎస్‌ఆర్‌ అని పెట్టడం సరికాదన్నారు.

పవన్‌ హెలిప్యాడ్‌ ధ్వంసం
గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను శుక్రవారం అర్ధరాత్రి వైసిపి నాయకులు ధ్వంసం చేశారని టిడిపి నాయకులు ఆరోపించారు. హెలిప్యాడ్‌ను జెసిబితో వైసిపి అభ్యర్థి అంబటి మురళీ అనుచరులు తవ్వేశారని టిడిపి అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఇటీవల సిఎం జగన్‌ వచ్చిన సందర్భంగా తాము ఏర్పాటు చేసుకున్న హెలిప్యాడ్‌ను జనసేన, టిడిపి వారు వినియోగించుకునేందుకు సంబంధిత కాంట్రాక్టరుకు అడిగినంత సొమ్ము ఇవ్వకపోవడం వల్ల ఆయన ధ్వంసం చేయించారని వైసిపి అభ్యర్థి అంబటి మురళీకృష్ణ తెలిపారు.

➡️