అనంతపురంలో గర్భిణి ఆకలి చావు బాధ్యత ప్రభుత్వానిదే

  •  సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌
  • చేనేత కుటుంబం ఆత్మహత్యపై సమగ్ర విచారణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తనది సంక్షేమ రాజ్యమని ప్రకటించుకుంటూ నవరత్నాల పేరుతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు చేనేత కుటుంబ ఆత్మహత్య, అనంతపురం కలక్టరేట్‌ వద్ద జరిగిన దళిత గర్భిణి ఆకలి చావు సాక్షి భూతాలుగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లా కొత్త మాధవరం చేనేత కుటుంబం ‘ఆత్మహత్య’పై సమగ్ర విచారణ జరిపించాలని, ఆకలి చావుతో మరణించిన గర్భిణి పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆకలితో గర్భిణి మరణించడం అందరి హృదయాలను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందకపోవడం శోచనీయమని తెలిపారు. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 77 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా ఆకలి చావులు సంభవించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని అన్నారు. ఆకలి చావుతో మరణించిన ఆమె పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చిందెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రెవెన్యూ విభాగాల్లో అవినీతి ఎంత హెచ్చుస్థాయిలో ఉందో దీనిని బట్టి అర్థమవుతుందని, వైసిపి నేతల భూ దాహానికి తోడు అధికారుల అలసత్వానికి నిండు కుటుంబం బలైపోయిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అవినీతి తారాస్థాయిలో ఉందని తెలిపారు. నియోజకవర్గ వైసిపి నేతల అనుచరులు సుమారు 600 ఎకరాలకుపైగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తొలగించి అనర్హుల పేర్లను ఎక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చోటుచేసుకున్న వైసిపి నాయకుల దురాగతాలకు సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఆత్మహత్యకు కారకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించి, వారి భూమిని వారికి అప్పగించాలని కోరారు.

➡️