పాత పథకాల నిధులు నిలుపుదలపై వ్యాజ్యాలు

May 7,2024 22:20 #AP High Court, #judgement

ప్రజాశక్తి-అమరావతి :రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెన, మహిళలకు వైఎస్సార్‌ చేయూత నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అనంతపురం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన రైతులు, విద్యార్థులు, ఓ గృహిణి అత్యవసర లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి బప్పుడి కృష్ణమోహన్‌ మంగళవారం విచారణ చేపట్టారు.
రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.847.22 కోట్ల పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన యల్లక్కగారి నారాయణ, గాజుల శ్రీనివాసులు పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యా దీవెన కింద రూ.610.79 కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ పల్నాడులోని గుడిపాడుకు చెందిన పఠాన్‌ సూరజ్‌, గుంటూరులోని అడవి తక్కిళ్లపాడుకు చెందిన బంకా అరుణ పిటిషన్‌ వేశారు. చేయూత కింద నిధులను పంపిణీని నిలుపుదల చేస్తూ ఇసి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరు, భారత్‌పేటకు చెందిన గృహిణి కె శాంత కుమారి ఇంకో పిటిషన్‌ వేశారు.
ఇసి తరఫున సీనియర్‌ న్యాయవాది దేశారు అవినాష్‌ వాదిస్తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే ఇసి వాటి అమలును నిలుపుదల చేసిందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెన నిధుల పంపిణీ అత్యవసరం ఏముందో రాష్ట్రం వివరిస్తూ వినతిపత్రం ఇస్తే దానిపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. వాదనల తర్వాత స్పందించిన హైకోర్టు.. రాష్ట్రం తాజాగా సమర్పించే వినతిపై ఇసి తీసుకునే నిర్ణయాన్ని నివేదించాలని ఇసిని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

➡️