స్పెషల్‌ డిఎస్‌సిపై నిర్ణయం తీసుకోకుంటే..10న మన్యం బంద్‌

Mar 4,2024 10:36 #10, #Bandh, #Manyam District, #special DSC
  • ఆదివాసీ సంఘాల పిలుపు

ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ నాటికి ఆర్డినెన్స్‌ జారీ చేయకుంటే 10న రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్‌ నిర్వహిస్తామని ఆదివాసీ ప్రజా సంఘాల రాష్ట్ర స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజన సంఘం కార్యాలయంలో ఏజెన్సీ ప్రాంత డిఎస్‌సి సాధన కమిటీ, ఆదివాసీ గిరిజన సంఘం అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, ఎస్‌టి ఎంప్లాయీస్‌ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నీలకంఠం, యుటిఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్‌.నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.హైమావతి, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ, ఆదివాసీ కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి టి.కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలన్న జిఒ నెంబర్‌ 3ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జనరల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌లో షెడ్యూల్‌ ఏరియాలో 517 ఉపాధ్యాయ పోస్టులను నోటిఫై చేసి కేవలం 38 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఆదివాసీలకు కేటాయించడం దారుణమన్నారు. 1/70 చట్టం ఏజెన్సీలో ఉల్లంఘనకు గురవుతోందని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిఒ నెంబర్‌ 3 చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివాసీ వాల్మీకి, కొండ దొర తెగలను తొలగించడం అన్యాయమన్నారు. తక్షణమే పునరుద్ధరించాలని, మాతృభాషా విద్యా వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని, నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలో ఉన్న 1500 గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని కోరారు.

పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంత డిఎస్‌సి సాధన కమిటీ కన్వీనర్‌ నరేష్‌, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, మాతృభాష ఉపాధ్యాయుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

➡️