వలసలు పోకుండా చర్యలు

Apr 28,2024 08:51 #chandrababau, #speech

– ఇంటింటికీ కుళాయి నీరు
– ప్రజాగళం సభల్లో చంద్రబాబు
ప్రజాశక్తి – కర్నూలు, నెల్లూరు ప్రతినిధులు :కర్నూలు జిల్లా నుంచి ఎవ్వరూ వలసలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. టిడిపితోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం, కోడుమూరు నియోజకవర్గం గుడూరులో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. 99 శాతం హామీలను అమలు చేశామని సిఎం జగన్‌ చెబుతున్నారని, ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అని ప్రశ్నించారు. 102 ఇరిగేషన్‌ ప్రాజెక్టులను జగన్‌ రద్దు చేశారని విమర్శించారు. జగన్‌ ప్యాలెస్‌ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని అన్నారు. సామాజిక సమీకరణల ప్రకారం కర్నూలు జిల్లాలో టికెట్లు ఇచ్చామని తెలిపారు.తాగునీరు ఎక్కడ ఉంటే అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, పక్కనే తుంగభద్ర నది ఉన్నా.. ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి నీళ్లు లేవన్నారు. జగన్‌ను నమ్మి రాయలసీమ ప్రజలు మోసపోయారు. వైసిపిని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు న్యాయం చేస్తామన్నారు. రహదారులను బాగు చేసే బాధ్యత తమదేనన్నారు. పేదలకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామని, ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇంటింటికి కుళాయి ద్వారా తాగు నీరు, డ్వాక్రా సంఘాలకు రూ.పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సోలార్‌ ద్వారా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామని, ఛార్జీలు పెరగకుండా ఆదుకుంటామని అన్నారు. సభలో టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి, టిడిపి మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి, ఎంపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పాల్గన్నారు.
ముస్లిములకు టిడిపి హయంలోనే లబ్ధి
హజ్‌యాత్రికుల కోసం ఒక్కో ముస్లిం సోదరికి లక్ష రూపాయలు సాయం చేశామని చంద్రబాబు తెలిపారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌లో జరిగిన ముస్లిం అత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగను రాష్ట్ర పండుగా మార్చింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ముస్లింలు లేకపోతే అభివృద్ధి లేదని ప్రతి పట్టణంలోని ఆటోనగర్‌లో ముస్లింలే ఎక్కువ మంది పనిచేస్తున్నారని తెలిపారు.

➡️