మోడీకి ఎపిలో అడుగుపెట్టే అర్హత లేదు

May 8,2024 21:42 #press meet, #ys sharmila

– రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– ప్రధానికి రేడియో బహుమతి ఇస్తా : షర్మిల
ప్రజాశక్తి-కడప :ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హతే లేదని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా డిసిసి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటగా రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలన్నారు. ‘మీరు ఎన్నికల ప్రచారం కోసం కాకుండా అభివృద్ధి కోసం ఒక్కనాడైనా వచ్చారా’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుతానని రాత పూర్వక అఫిడవిట్‌ రాసి ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎపి ప్రజలను మోడీ మనుషులుగా చూడటం లేదని, ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నారని విమర్శించారు. పదేళ్లలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ఆయనవన్నీ దిగజారుడు రాజకీయాలేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టిడిపితో బహిరంగ పొత్తు, జగన్‌మోహన్‌రెడ్డితో అక్రమ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. మొదటి ఐదేళ్లు చంద్రబాబుతో, తర్వాత ఐదేళ్లు దత్తపుత్రుడు జగన్‌తో పొత్తు పెట్టుకున్నారని పేర్కొన్నారు. బిజెపికి అన్ని బిల్లుల్లో జగన్‌ సహాయం చేశారని, రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. రిలయన్స్‌కి పదవులు ఇచ్చారని, గంగవరం పోర్టు అదానీకి అప్పగించారని పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రజల మన్‌కి బాత్‌ వినండి, మా ప్రజల పక్షాన మీకు ఛార్జ్‌షీట్‌ పంపుతున్నాం. పదేళ్లు మీరు చేసిన మోసానికి పది ప్రశ్నలు పంపుతున్నాము’ అని పేర్కొన్నారు. ముందు వాటికి సమాధానం చెప్పిన తరువాతే ఆంధ్రాలో అడుగు పెట్టాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి వేదికగా ఎపికి పదేళ్ల హోదా ఇస్తామని మోడీ చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు దాటినా ప్రత్యేక హోదా లేదని, విభజన హామీలు ఒక్కటైనా నెరవేర్చలేదని షర్మిల వివరించారు.
మోడీకి సంధించిన షర్మిల పది ప్రశ్నలు
1) నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని, ఎపికి హోదా ఎందుకు ఇవ్వలేదు.
2) జగన్‌ రివర్స్‌ టెండరింగును అడ్డుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వినాశనానికి ఎత్తు తగ్గించే కుట్రలు ఎందుకు చేస్తున్నారు.
3) మీ చేతులమీదుగా భూమిపూజ జరిపించుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా ఎందుకు పూర్తి కాలేదు.
4) పోరాటాలు, ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును అమ్మేందుకు చూడడం ఎంత వరకూ సమంజసం.
5) కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌ వంటివి ఎందుకు తుంగలోతొక్కి, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు.
6) ఢిల్లీలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించిన మీరు మద్యం సిండికేటు నడుపుతూ, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు.
7) రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా, మీ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తున్నా, రాష్ట్ర సర్కారును ప్రశ్నించలేదు, చర్యలకు ఉపక్రమించలేదు ఎందుకని?
8) ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొంగదారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్ర ఇచ్చే నిధుల మళ్లింపు, ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా, కేంద్రం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు?
9) కర్నూలులో అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడానికి వచ్చిన సిబిఐ శాంతిభద్రతల సమస్యంటూ బెదిరి వెనుతిరిగింది. ఈ విషయంలో మీ సర్కారు మిన్నకుండి కూర్చోవడం యావత్‌ దేశానికే అవమానం
10) దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని నెరవేర్చకుండా దేశ యువతను, నిరుద్యోగులను ఘోరంగా ఎందుకు మోసం చేశారు ?

➡️