అదానీ వ్యాపారాన్ని వృధ్ధి చేయడమే మోడీ కర్తవ్యం

Nov 20,2023 21:22 #aidwa, #Punyavati
  • అఖిల భారత సన్నాహక సమావేశంలో పుణ్యవతి

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖ) : అదానీ వ్యాపారాన్ని వృద్ధి చేయడమే మోడీ ప్రథమ కర్తవ్యమని ఐద్వా అఖిల భారత కోశాధికారి ఎస్‌.పుణ్యవతి విమర్శించారు. ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అఖిల భారత సమావేశాల సన్నాహక సమావేశాన్ని సోమవారం విశాఖ జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు బి.పద్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్‌.పుణ్యవతితోపాటు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ.. అదానీ కోసం విశాఖపట్నం సముద్రాన్ని సైతం మోడీ వదలిపెట్టలేదన్నారు. భవిష్యత్తులో సముద్రాన్ని చూడడానికి డబ్బు చెల్లించాల్సి వస్తుందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చింది మొదలు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మనువాదపు భావజాలాన్ని దేశంపై రుద్దే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉందన్నారు. చివరకు భిన్నత్వంలో ఏకత్వం అన్న దేశ లక్షణాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రమాదకారి అయిన మోడీ నుంచి దేశాన్ని, మహిళలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వివరించారు. అందులో భాగంగానే గత నెల 5న ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగ సభలో ‘మోడీ హఠావో – దేశ్‌ భచావో, నారీ భచావో’ నినాదాన్ని తీసుకున్నామని చెప్పారు. ఆ నినాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి విశాఖలో నిర్వహించే అఖిల భారత సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి మాట్లాడుతూ.. మత్తుమందు కారణంగా విశాఖ జిల్లాలో మహిళలపై హింస పెరుగుతోందన్నారు. వీటిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ధరలు పెరుగుదల, మహిళలు- హింస, డ్వాక్రా వంటి వివిధ రకాల అంశాలపై జాతీయ నాయకులతో ఐద్వా అఖిల భారత సమావేశాల సందర్భంగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం నాంది పలకబోతున్న ఈ సమావేశాలను ప్రజానీకం అంతా ఆర్థిక, హార్థిక సహాయాన్ని అందించి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్‌ జి.ప్రియాంక, ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల నాయకులు రమణమ్మ, విమల, హైమావతి, లక్ష్మి, వరలక్ష్మి, నాగరాణి, భారతి, మాణిక్యం, రమ, అనురాధ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️