‘ఉపాధి’ పనులు అడ్డగించిన పోర్టు అధికారులు – మూలపేటవాసుల ఆగ్రహం

Apr 12,2024 22:20 #Protest, #srikakulam, #upadi employee

– పోర్టు వాహనాలు అడ్డగింత
ప్రజాశక్తి – నౌపడ (శ్రీకాకుళం జిల్లా) :శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసిత ప్రాంతం మూలపేటలో రెండు రోజులుగా చేపడుతున్న ఉపాధి పనులను పోర్టు అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మూలపేట గ్రామస్తులు, ఉపాధి కార్మికులు పోర్టు వాహనాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. తాము గ్రామంలో ఉన్నంత వరకు ఉపాధి పనులు అడ్డుకునే హక్కు పోర్టు యాజమాన్యానికి లేదని తెలిపారు. గతంలో 81.09 ఎకరాల రెవెన్యూ భూములను ఎపి మారిటైమ్‌ బోర్డుకు కేటాయించారని, ఆ భూములు పోర్టు పరిధిలోకి వస్తాయని పోర్టు అధికారులు చెప్పడంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోర్టు కోసం భూములు ఇచ్చాక మళ్లీ ఎందుకు పనులు చేస్తున్నారని పోర్టు అధికారులు ప్రశ్నించడంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ప్రభుత్వం ఈ భూముల్లో ఉపాధి పనులకు నిధులు మంజూరు చేసిందని, పనులు నిలుపుదల చేయించడానికి మీరెవరంటూ గ్రామస్తులు పోర్టుకు వచ్చే పలు ఉద్యోగస్తుల వాహనాలను, రాళ్లు, మట్టి తరలిస్తున్న లారీలను నిలుపుదల చేశారు. సబ్‌ కలెక్టర్‌, తహశీల్దార్‌ వచ్చి ఎందుకు ఉపాధి పనులు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆందోళన విషయాన్ని ఎంపిడిఒ ఉమాసుందరి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి రెండు రోజుల్లో ఉపాధి పనులు కల్పిస్తామని తెలపడంతో కార్మికులు ఆందోళన విరమించారు.

➡️