భిక్షాటనతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 11,2024 08:09 #Dharna, #muncipal workers
  • సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
  • 16వ రోజుకు చేరిన ఆందోళనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చాలీచాలని వేతనాలు ఇస్తుందని, ధర్మం చేయండి అంటూ కార్మికులు భిక్షాటన చేశారు. వంటావార్పు, అర్ధనగ ప్రదర్శనలు, ముగ్గులు వేస్తూ నిరసనలు కొనసాగించారు. పలుచోట్ల పారిశుధ్య పనులు చేస్తున్న పోటీ కార్మికులను, చెత్త వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

విశాఖలోని మధురవాడలో చెత్త సేకరణకు వచ్చిన పోటీ కార్మికులను, వాహనాలను జివిఎంసి 5, 6, 7, 8 వార్డుల పరిధిలోని పారిశుధ్య కార్మికులు అడ్డుకున్నారు. దీంతో 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పిఎం.పాలెంలో కార్మికులు వంటా వార్పు చేశారు. విజయనగరం, రాజాంలో భిక్షాటన చేసి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. నెల్లిమర్లలో మున్సిపల్‌ అధికారులు పోటీ కార్మికులతో పారిశుధ్య పనులు చేయించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వేప కొమ్మలు పట్టుకొని, సాలూరులో సమ్మె 16 రోజులైన సందర్భంగా ఆ నెంబరు ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో మున్సిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తిలు సందర్శించి సంఘీభావం తెలిపారు. చిత్తూరులో అర్ధనగ ప్రదర్శన, గుంటూరులో భిక్షాటన చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధికారులు పోటీ కార్మికులతో పనులు చేయిస్తుండగా సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. పిడుగురాళ్లలో అర్ధనగ ప్రదర్శన చేశారు. వినుకొండలో వంటావార్పు నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఏలూరులో భిక్షాటన చేశారు. నంద్యాలలో భిక్షాటన, కర్నూలులో సాష్టాంగ నమస్కారం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా జగయగ్యపేటలో మోకాళ్లపై నిరసన తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో భిక్షాటన, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి నిరసన తెలిపారు. నెల్లూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు.

➡️