కొనసాగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె 

municipal workers strike
  • నరసరావుపేటలో టెంట్‌ ధ్వంసం 
  • రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదవ రోజుకు చేరిన ఆందోళనలు

ప్రజాశక్తి – యంత్రాంగం : సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. పలు జిల్లాల్లో అధికారులు పోటీ కార్మికులతో పనులు చేయించడాన్ని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో నరసరావుపేటలో సమ్మె టెంట్‌ను కొందరు దుండగులు తొలగించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ర్యాలీలు నిర్వహించారు. అధికారుల బెదిరింపులకు భయపడమని, సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగుతుందని కార్మికులు తేల్చిచెప్పారు.గుంటూరులో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదుట పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి జి.ఉషారాణి, ఇతర పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సమ్మె శిబిరం నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ప్రదర్శన చేసి ఆర్‌డిఒకు వినతిపత్రం ఇచ్చారు. కాగా సమ్మె శిబిరం టెంట్‌ ను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఎమ్మెల్యే అనుచరుల పనేనని నాయకులు, కార్మికులు విమర్శించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. తెనాలి, నెల్లూరులో పోటీ కార్మికులతో పనులు చేయించడాన్ని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు.

అనంతపురం కార్పొరేషన్‌లో పోటీ కార్మికుల ద్వారా చెత్త తరలింపుకు అధికారులు యత్నించగా కార్మికులు, సిఐటియు నాయకులు అడ్డుకొని నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మున్సిపల్‌ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా..అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు కార్మికులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. కడపలో చెత్త వాహనాలను తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. రాజంపేటలో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. విశాఖ జివిఎంసి 7,8 వార్డులలో పోటీ కార్మికులతో అధికారులు పనులు చేయించడాన్ని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్‌టిఆర్‌ స్టేడియం వద్ద మున్సిపల్‌ కార్మికులు సమ్మెను కొనసాగించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. ఏలూరులోని పలుచోట్ల పోటీకార్మికులతో ట్రాక్టర్లను బయటకు తీయగా మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరులో పోలీసుల సహకారంతో పోటీ కార్మికులతో పనులు చేయించేందుకు తిరువూరు నగర పంచాయతీ కమిషనర్‌ బాలకృష్ణ చేసిన ప్రయత్నాలను మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు.కోనసీమ జిల్లా అమలాపురం, మండపేట, రామచంద్ర పురం, అమలాపురం మున్సిపల్‌ కార్యాలయాల వద్ద, తూర్పుగోదావరిలో కొవ్వూరు, నిడదవోలు మున్సిపల్‌ కార్యాల యాల వద్ద, కాకినాడ జిల్లాల్లో పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాలను కొనసాగిం చారు. మండపేటలో పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదు ట మానవహారం చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉరితాళ్లతో నిరసన తెలిపారు. ఉమ్మడి చిత్తూరు, విజయ నగరం జిల్లాల్లో నిరసనలు కొనసాగాయి.

➡️