నేటి నుంచి నామినేషన్లు

  • 11 నుంచి 3 గంటల వరకు స్వీకరణ
  •  సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి (గురువారం) నుంచి ప్రారంభమవుతుందని, ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్థి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే ఆర్‌ఒ కార్యాలయం వరకు అనుమతిస్తారని, మిగిలినవారిని వంద మీటర్ల అవతల నిలిపివేస్తారని చెప్పారు. అభ్యర్థితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు ధరావతు చెల్లించాల్సి ఉంటుందని సిఇఒ తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు ధరావతు మొత్తంలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు మోడల్‌ కోడ్‌ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగు చేస్తారని సిఇఒ తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అభ్యర్థులు నామినేషన్‌ దాఖలుకు 13 రకాల డాక్యు మెంట్లను తీసుకు రావాలి. పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థులు ఫారమ్‌ 2ఎ, అసెంబ్లీకి పోటీ చేసే వారు ఫారమ్‌ 2బిలో దరఖాస్తు చేయాలి. పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. పబ్లిక్‌ సెలవు దినాల్లో నామినేషన్‌ స్వీకరించబడదు. నామినేషన్లను ఆర్‌ఒకు గానీ, సంబంధిత ఎఆర్‌ఒకు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి తమ నామినేషన్‌ను నేరుగా గానీ, తన ప్రపోజరు ద్వారా గానీ సమర్పించవచ్చు. అభ్యర్థి తమ నామినేషన్‌తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి ఒక అభ్యర్థి నామినేషన్లను ఫైల్‌ చేయడం కుదరదు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సువిధ యాప్‌ ద్వారా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటకీ వాటి కాపీలను భౌతికంగా ఆర్‌ఒకు అందజేయాల్సి ఉంటుంది. ఫారమ్‌-26 ద్వారా తన అఫిడవిట్‌ను సమర్పించాలి. ఫారమ్‌ -26, స్టాంప్‌ పేపర్‌ విలువ రూ.10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అభ్యర్థి నామినేషన్‌ వేసిన దగ్గర నుంచి ఖర్చు వారి ఖాతాలో లెక్కించడం జరుగుతుంది. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో ఎన్నికల కమిషన్‌ లెక్కిస్తుంది.

ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్‌
ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ: 18.04.24
(నామినేషన్ల స్వీకరణ ప్రారంభం)
నామినేషన్లకు చివరి తేదీ : 25.04.24
పరిశీలన : 26.04.24
ఉపసంహరణ : 29.04.24
పోలింగ్‌ : 13.05.24
కౌంటింగ్‌ : 04.06.24
ఎన్నికల ప్రక్రియ ముగిసేది : 06.04.24

➡️