కాంగ్రెస్‌తో మళ్లీ పాత రోజులు

May 1,2024 00:46 #medak, #meeting, #PM Modi

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంక్‌ రాజకీయాలు అనే పంచ సూత్రాలతో కాంగ్రెస్‌ పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశంలో పాత రోజులు తీసుకురావాలని చూస్తోందన్నారు. బిజెపి అభ్యర్థులకు మద్దతుగా మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొస్తే వారసత్వ సంపద నుంచి కొత్త ట్యాక్స్‌ వసూలు చేస్తామంటోందన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన దానిలో 55 శాతం ఆస్తి పిల్లలకు దక్కకుండా కుట్రలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ ఇప్పుడు బిజెపిపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. గుజరాత్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన తర్వాత పార్లమెంట్‌ హాలులో రాజ్యాంగానికి మోకరిల్లి నమస్కరించానని, అలాంటి తాను రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తానని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగం, భగవద్గీత పవిత్ర గ్రంథాలని, వాటిని సమానంగా కొలుస్తానని గొప్పలు చెప్పుకున్నారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకొన్నందున ప్రధాని ఇలా ఆత్మ రక్షణ చేసుకొన్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, బిసిల హక్కులను కాలరాసిందని విమర్శించారు. ముస్లిములను ఒబిసిల జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ తోడు దొంగలని, ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలా రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో అధిక ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సభలో మంత్రి కిషన్‌ రెడ్డి, ఒబిసి జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️