తిరుమల నుండి అయోధ్యకు లక్ష లడ్డూలు : టిటిడి ఈఒ ధర్మారెడ్డి

తిరుపతి : ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని … అక్కడికి తిరుమల నుండి లక్ష లడ్డూలను పంపనున్నట్లు టిటిడి ఈఒ ధర్మారెడ్డి ప్రకటించారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ ఈఒ’ కార్యక్రమంలో ధర్మారెడ్డి మాట్లాడారు. అయోధ్యకు పంపనున్న ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని తెలిపారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా … ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని తెలిపారు. వేంకటేశ్వరుడి భక్తులు నకిలీ వెబ్‌ సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతోనే అధికారిక వెబ్‌ సైట్‌ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్‌ చేసుకోవాలని భక్తులను కోరుతున్నట్లు ఈవో చెప్పారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15న తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్‌ మైదానంలో సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ‘శ్రీ గోదా కల్యాణం’ వైభవంగా నిర్వహిస్తామన్నారు. జనవరి 16న కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు ధర్మారెడ్డి ప్రకటించారు.

➡️