ఒకే రాష్ట్రం…ఒకే రాజధాని..!

May 2,2024 23:28 #2024 election, #Nara Lokesh, #TDP
  •  అభివృద్ధి వికేంద్రీకరణే టిడిపి లక్ష్యం
  •  చంద్రగిరిలో ‘హలో లోకేష్‌’

ప్రజాశక్తి -తిరుపతి బ్యూరో, రామచంద్రపురం (చంద్రగిరి) : ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని… అభివృద్ధి వీకేంద్రీకరణే టిడిపి లక్ష్యం’ అని నారా లోకేష్‌ అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ‘హలో లోకేష్‌’ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ వన్‌గా ఉండేదని, ప్రస్తుతం జగన్‌రెడ్డి పాలనలో గంజాయి, కోడికత్తి, గులకరాయి, కంపెనీలను తరమడం, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచడంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని విమర్శించారు. రాజధాని లేని అనాధ రాష్ట్రంగా మారిందన్నారు. సెల్‌కాన్‌, బ్లూస్టార్‌ ఎసిలు మేడిన్‌ చిత్తూరు జిల్లా అని, టిసిఎల్‌, డిక్సిన్‌, సెల్‌కాన్‌ పరిశ్రమల్లో 50 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు. అమరరాజా పరిశ్రమ ఉండి ఉంటే 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. 2019లో ఒక్క కుప్పం మినహా అన్ని స్థానాల్లోనూ వైసిపిని గెలిపించారని, ఒక్క కంపెనీ, ఒక్క ఉద్యోగం ఇచ్చారా? అని నిలదీశారు. చిత్తూరు జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి ఉన్నారని, ల్యాండ్‌, మైన్‌, వైన్‌ దేన్నీ వదలరని ఆరోపించారు. టిడిపి, జనసేన, బిజెపి తొలి సంతకం మెగా డిఎస్‌సిపైనేనని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామన్నారు. చంద్రగిరిలో ఓడిపోతానని తెలిసే ఒంగోలుకు చెవిరెడ్డి పారిపోయారని విమర్శించారు. చిత్తూరు ఎంపి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్‌, అసెంబ్లీ అభ్యర్థి పులివర్తి నానిలను గెలిపించాలని కోరారు.

➡️