బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్లు

Apr 29,2024 08:34 #bank accounts, #pention

ఖాతా లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ
– మే 1న ఖాతాలో జమ
– 5వ తేదీ లోపు పంపిణీ పూర్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:సామాజిక భద్రత పింఛను పొందే లబ్ధిదారులు పింఛన్‌ కోసం మండుటెండలో సచివాలయాలకు వెళ్లి, అక్కడ పడిగాపులు పడాల్సిన పనిలేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే పింఛన్‌ నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మే, జూన్‌ నెలలకు సంబంధించిన పింఛన్‌ను ప్రభుత్వం ఈ డైరెక్టు బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) పద్ధతిలో పింఛనుదారులకు అందించబోతోంది. అలాగే ఎవరికైతే బ్యాంకు ఖాతాలు లేవో.. వారందరికీ ఇంటి వద్దనే పింఛన్‌ పంపిణీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి, లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో, ఇంటి వద్దనే పింఛను అందించాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని, పింఛను తీసుకోవటంలో వారు అసౌకర్యానికి గురి కాకూడదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం పింఛను పంపిణీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులకు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పింఛను డబ్బులు మే 1వ తేదీనే వారి బ్యాంకు ఖాతాలో జమవుతాయని, అలాగే మే నెలకు సంబంధించిన పింఛను డబ్బులు జూన్‌ 1న జమవుతాయని ఆయన తెలిపారు. ఆధార్‌తో ఏ బ్యాంకు ఖాతా అయితే లింక్‌ అయి ఉందో, ఆ ఖాతాకు డబ్బులు జమవుతాయని.. ఎవరికైతే డిబిటి ద్వారా పింఛను డబ్బులు వస్తున్నాయో వారి వివరాలతో కూడిన జాబితా గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
– 48 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లో జమ
రాష్ట్రంలో ప్రస్తుతం 65,49,864 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరంతా మే నెలలో పింఛను తీసుకోబోతున్నవారే. అయితే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) లెక్కల ప్రకారం వీరిలో 48,92,503 మందికి మాత్రమే ఆధార్‌, బ్యాంకు ఖాతాతో మ్యాప్‌ అయి ఉంది. మే 1వ తేదీనే వీరికి డబ్బులు జమవనుండగా.. వారికి బ్యాంకు ఖాతాకు లింక్‌ అయిన ఫోన్‌ నెంబరుకు మెసెజ్‌ వస్తుంది. ఇక ఎవరికైతే బ్యాంకు ఖాతా లేదో/ లింక్‌ కాలేదో వారికి నేరుగా ఇంటికే వచ్చి పింఛను డబ్బులు అందజేస్తారు. అధికారిక డేటా ప్రకారం 16,57,361 (25.30 శాతం) మందికి ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా మ్యాప్‌ కాలేదు. దీంతో వీరందరికీ ఇళ్ల దగ్గరే పింఛను అందించనున్నారు. మే 1న ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమై.. మే 5వ తేదీ వరకు కొనసాగుతుంది. బ్యాంకు ఖాతాలు లేనివారి వివరాలు ఇప్పటికే సంబంధిత సచివాలయాల వద్ద/పింఛన్‌ పంపిణీ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

➡️