తిరుపతిలో పోలీసుల బీభత్సకాండ – పేదలపై దౌర్జన్యం – సిపిఎం నేతలు హౌస్‌ అరెస్ట్‌

కరకంబాడి (తిరుపతి) : కరకంబాడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కబ్జాదారులను వదిలి పేదలపై వైసిపి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుండే పోలీసులు తిరుపతిలోని కరకంబాడిలో బీభత్సాన్ని సృష్టించారు. పేదలు వేసుకున్న పాకలను పీకి పారేసుందుకు జెసిబిలను రంగంలోకి దించారు. ఎటు చూసినా పేదల రోదనలే వినబడుతున్నాయి. 600 మందికి పైగా పోలీసులు మోహరించారు. సిపిఎం నేతలు అడ్డుకోకుండా వారిని ముందస్తు అరెస్టులు చేశారు.

తెల్లవారుజామున 3 గంటల నుంచి 9 గంటల వరకు ఆరు గంటలపాటు కరకంబాడిలో పోలీసులు దౌర్జన్యకాండ చేశారు. కరకంబాడి తారక రామానగర్‌ లో ప్రజలు బయటికి రాకుండా పోలీసులు దిగ్బంధనం చేశారు. నెల రోజులకు పైగా ఇళ్ల స్థలాల కోసం పేదలు పోరాడుతున్నారు. వైసిపి నేతల నుండి కబ్జాలకు గురవుతున్న భూములను కాపాడుకుంటున్నారు. కబ్జాదారులను వదిలిపెట్టి పేదలపై దాడికి వైసిపి ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు … సిపిఎం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేశారు. తిరుపతిలో కందారపు మురళి, శ్రీకాళహస్తి లో అంగేరి పుల్లయ్య, రేణిగుంట లో హరి నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సిపిఎం నేతల ఇళ్ల వద్ద పోలీసు పహారా కాస్తున్నారు. గూడు లేని పేదలపై ప్రభుత్వం దౌర్జన్యం చేయడం దుర్మార్గం అంటూ … సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తీవ్రంగా ఖండించారు.

➡️