కొండెక్కిన కోడి మాంసం ధరలు

Mar 1,2024 12:25 #chicken meat, #prices

ప్రజాశక్తి – నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : కోడి మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం వరకూ కిలో రూ.200లకుపైగా ఉన్న ధర ఒక్కసారిగా కొండెక్కింది. వేసవిలో ఫారం, బాయిలర్‌ కోళ్లు ఎండ వేడిమికి చనిపోతుంటాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఫారాల నిర్వహణపై పెద్దగా ఆసక్తి చూపరు. ఒకవేళ నిర్వహించినా నష్టాలు రావడంతో రైతులు వీటికి దూరంగా ఉంటున్నారు. దీంతో కోళ్లు అందుబాటులో లేక ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దాణా రేట్లు పెరగడం నిర్వహణ భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఫలితంగా కోడిమాంసం ధర అమాంతం కొండెక్కింది. కిలో బాయిలర్‌ మాంసం రూ.280, లైవ్‌ రూ.180, స్కిన్‌ లెస్‌ రూ.300, బ్రాయిలర్‌ బోన్‌ లెస్‌ రూ.420లకు విక్రయిస్తున్నారు. ఫారం కోడి మాంసం ధర రూ.200, లైవ్‌ రూ.150 ఉంది. వేసవిలో గ్రామాల్లో జాతర్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. గతంలో కంటే రెస్టారెంట్‌, భోజనం హోటల్లో, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లోనూ చికెన్‌ వినియోగం బాగా పెరిగింది. ఈ కాలంలో చేపల వినియోగం తగ్గి మాంసం వినియోగం పెరగడమూ మరో కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగినట్లు కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో చికెన్‌ ధరలు పెరిగాయి. అయితే కోడిమాంసం ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

➡️