రబీ బెంగ..! 

rabi farmers problems
  • రెండు జిల్లాల్లోనూ పూర్తికాని నాట్లు
  • ఇప్పటివరకూ 40 శాతం నాట్లు మాత్రమే పూర్తి
  • దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం
  • ఆందోళనలో రెండు జిల్లాలోని రైతాంగం

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధిరబీ సాగుపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాట్లు పూర్తయ్యేసరికి మరో మూడు వారాలు పట్టే అవకాశం కనిపి స్తోంది. సాగుకు అదును తప్పే పరిస్థితి ఏర్పడింది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.ప్రస్తుత రబీలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో, ఏలూరు జిల్లాలో 98,726 ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. గడిచిన డిసెంబర్‌ నెలఖారుకు రబీనాట్లు పూర్తికావాలని అధికారులు ప్రణాళికలు వేశారు. డిసెంబర్‌ మొదటివారంలో మిచౌంగ్‌ తుపాను విరుచుకు పడడంతో రబీ పరిస్థితి మొత్తం తారుమారైంది. ఖరీఫ్‌ మాసూలు పూర్తయ్యేసరికి సమయమంతా గడిచిపోయింది. దీంతో నారుమడులు వేయడంలో తీవ్ర ఆలస్యం నెలకొంది. జనవరి 20వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ పశ్చిమ, ఏలూరు జిల్లాలో 40 శాతం మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. ఇంకా 60 శాతం నాట్లు పూర్తికావాల్సి ఉంది. ఏలూరు జిల్లాలో 98.726 ఎకరాలకు గాను, 40 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు నాటిన పరిస్థితి నెలకొంది. నిడమర్రు, భీమడోలు వంటి పలు మండలాల్లో కొల్లేరుకు ఆనుకుని ఉన్న సాగుకు సంబంధించి నారుమడులు వేసి రెండు, మూడురోజులు మాత్రమే అవుతోంది. దీంతో ఫిబ్రవరి రెండోవారం వరకూ నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గడిచిన ఖరీఫ్‌లో తుపాను ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ధాన్యం తడిసిపోయి, రంగుమారడంతో అయినకాడికి అమ్ముకోవాల్సి న పరిస్థితి కొనసాగింది. వర్షాలకు తడిసిపోవడంతో రెట్టింపు ఖర్చులయ్యాయి. దీంతో ఖరీఫ్‌లో దిగుబడులు కొంతమెరుగ్గా వచ్చినప్పటికీ రైతులకు నష్టాలే మిగిలాయి.

ఆశలన్నీ రబీపైనే..

ఖరీఫ్‌లో తీవ్ర నష్టాలు మూటగట్టుకున్న రైతులు రబీసాగుపై ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సంక్రాంతి తర్వాత నాట్లు నాటితే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుందని రైతులు గత అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఏడాది మరింత దారుణంగా రబీ పరిస్థితి ఉంది. పెట్టుబడులు పెట్టి సాగుచేసిన తర్వాత దిగుబడి రాకపోతే పరిస్థితి ఏంటన్న భయం రైతులకు నిద్రలేకుండా చేస్తోంది. రెండు జిల్లాల రైతుల్లోనూ రబీసాగుపై తీవ్ర ఆందోళన నెలకొంది. రెండు జిల్లాల్లో సాగుతున్న సాగులో 70 శాతంపైగా కౌలురైతులే చేస్తున్నారు. ఖరీఫ్‌లో కౌలురైతులు తీవ్రంగా నష్టపోయినా నష్టపరిహారం జాబితాలో మాత్రం భూయజమానుల పేర్లే నమోదయ్యాయి. బ్యాంకుల్లో పంటరుణం తీసుకున్న రైతులకే బీమా వర్తిస్తోంది. దీంతో పంటనష్టం గానీ, బీమా గానీ కౌలురైతులకు అందే పరిస్థితి లేకుండా పోయింది. రబీలోనూ నష్టాలు చవిచూస్తే కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. మరోపక్క సాగునీటి సమస్యపైనా రైతుల్లో తీవ్ర గుబులు నెలకొంది. ఈ ఏడాది సాగునీరు తక్కువగా ఉండడంతో వంతులవారీ విధానంలో రబీకి సాగునీరు అందించేందుకు నిర్ణయించారు. ఫిబ్రవరి రెండోవారం వరకూ నాట్లు సాగితే ఏప్రిల్‌ నెలాఖరు వరకూ సాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. సాగునీటి సమస్య ఏర్పడితే పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. రబీసాగు అదును తప్పడంతో ముందుముందు పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అన్న భయం అన్నదాతను వెంటాడుతోంది. రబీసాగుకు అదునుతప్పడంతో వెదజల్లే పద్ధతి అవలంబించాలని అధికారులు రైతులను కోరుతున్నారు. దీంతో ఏలూరు జిల్లాలో వెదజల్లే ప్రక్రియ పలుచోట్ల కొనసాగుతోంది. సాగునీటి సరఫరాపై అధికారులు ఇప్పటినుంచే సరైన ప్రణాళికలు రూపొందించకపోతే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.

➡️