హైస్కూల్‌లో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై అత్యాచారం

May 23,2024 10:55 #10th student, #eleuru, #rape case
  • ఆలస్యంగా వెలుగులోకి వచిచ్న ఘటన
  • జువైనల్‌కు నిందితుడు తరలింపు
  • వీడియో చిత్రీకరించి వేదిస్తున్న నలుగురు అరెస్టు

ప్రజాశక్తి – మండవల్లి (ఏలూరు) : ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  మండవల్లి మండలం పుల్లపరు గ్రామానికి చెందిన బాలిక, చింతపాడుకు చెందిన మరో బాలిక ఇరువురు స్నేహితులు. ఈ నెల 15న మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లారు. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి చింతపాడుకు చెందిన బాలిక వెళ్లిపోయింది. అప్పటికే అక్కడ మాటువేసిన సహ విద్యార్థి.. బాలికను తరగతి గది లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సమయంలో ఆ బాలుడితో పాటు ఉన్న నలుగురు యువకులు అత్యాచారాన్ని వీడియో చిత్రీకరించారు. బాధిత బాలికను వేధించడం ప్రారంభించారు. ఆ బాలిక ఆకతాయిలకు ఎంతకీ లొంగకపోవడంతో అత్యాచార వీడియోలను వైరల్‌ చేశారు. ఆ వీడియోలు బాధిత బాలిక తల్లి వద్దకు చేరాయి. దీంతో తల్లి బాలికను అడగగా జరిగిందంతా తల్లికి వివరించింది. అనంతరం బాలిక తల్లి మండవల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసుకోగా కైకలూరు రూరల్‌ సిఐ కృష్ణకుమార్‌ వివరాలు సేకరించి అత్యాచారానికి పాల్పడిన బాలుడిని విజయవాడ జువైనల్‌కు తరలించారు. అత్యాచార వీడియోలను చిత్రీకరించి వైరల్‌ చేసిన నలుగురు యువకులను అరెస్టు చేసి కైకలూరు కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ రామచంద్రరావు తెలిపారు. ఇదిలా ఉంటే చింతపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో బాలిక అత్యాచార వీడియోలను చిత్రీకరించి వైరల్‌ చేసిన నలుగురిలో ఒక యువకుడు నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.

➡️