ప్రమాదంలో వ్యాన్‌బోల్తా – బయటపడ్డ రూ.7 కోట్ల నగదు

ప్రజాశక్తి-నల్లజర్ల(తూర్పు గోదావరి) :తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌ బోల్తా పడింది. ఈ వ్యాన్‌లో రూ.ఏడు కోట్ల నగదు బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని నాచారం వద్ద ఉన్న న్యూ కాంటెంటల్‌ కెమికల్‌ ఎర్త్‌ కంపెనీ నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని మాధవి ఎజిబిల్‌ బ్రాన్‌ ఆయిల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీకి కెమికల్‌ పొడి లోడుతో వ్యాను బయలు దేరింది. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్ర కాలువ దాటగానే ఈ వ్యాన్‌ను విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌ బోల్తా పడింది. వానులోని కెమికల్‌ పొడి బస్తాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. వాటి మధ్య ఏడు అట్ట పెట్టెలు బయటపడ్డాయి. సిఐ దుర్గాప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని బాక్సులను పరిశీలించగా వాటిలో రూ.500, రూ.200, రూ.100 నోట్ల కట్టలను గుర్తించారు. డిఎస్‌పి రామారావు, ఎంపిడిఒ నరేష్‌కుమార్‌, తహశీల్దార్‌, ఐటి అధికారుల సమక్షంలో లెక్కించారు. ఒక్కొక్క బాక్సులో రూ.కోటి చొప్పున రూ.7 కోట్ల నగదు ఉన్నట్టు గుర్తించారు. నగదును ఐటి అధికారులకు అప్పగించి కేసు నమోదు చేశామని డిఎస్‌పి తెలిపారు.

➡️