గ్లోబల్‌ ఎయిడ్‌ సంస్థ నిర్వాహకులు సాయిపద్మ మృతి

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : వైకల్యంతో బాధపడుతున్నా.. బడుగుల జీవితాలకే తన జీవితమంటూ ‘గ్లోబల్‌ ఎయిడ్‌’ అనే సంస్థను ఏర్పాటుచేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన బి.సాయిపద్మ (52) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను విశాఖలో విజేత ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు. వికలాంగురాలు అయినప్పటికీ మల్టీ టాలెంటెడ్‌ ఉమెన్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి డాక్టర్‌ బిఎస్‌ఆర్‌.మూర్తి విజయనగరం జిల్లా గజపతినగరంలో పేరొందిన వైద్యులు. ప్రస్తుతం విశాఖలో నివసిస్తున్న ప్రొఫెసర్‌ వి.బాలమోహన్‌దాస్‌.. సాయిపద్మకు స్వయానా చిన్నాన్న. చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంతో ఆమె వీల్‌చైర్‌కే పరిమితమైపోయారు. న్యాయవాది, రచయిత, రీడర్‌, సింగర్‌, పారా ఎయిర్‌ రైఫిల్‌ షూటర్‌గా సాయిపద్మ పేరొందారు. వైకల్య బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.

➡️