జీతాలు పడ్డాయి

May 2,2024 08:17 #ap government, #employee, #salary

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎంతో కాలానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల కు ఒకటో తేదీనే వేతనాలు పడ్డాయి. కొన్నేళ్లుగా ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు జమ కావడం అరుదుగా జరుగుతోంది. ఈ నెల మాత్రం ఒకేసారి అందరికీ చెల్లింపులు జరిగిపోయాయి. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు రోజు అయినప్పటికీ జీతాలు, పింఛన్లను నేరుగా రిజర్వ్‌బ్యాంకు నుంచే చెల్లించారు. రాష్ట్ర సిఎఫ్‌ఎంఎస్‌ నేరుగా రిజర్వు బ్యాంకుకు అనుసంధానంగా ఉండడంతో చెల్లింపులు సజావుగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయమే ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తికావడం విశేషం. కొన్నేళ్లుగా జీతాలు, పింఛన్లపై జాప్యం జరుగుతుండడం, ఒక్కో నెల్లో పదో తేదీ నుంచి 15వ తేదీ వరకు చెల్లింపులు జరుగుతుండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఇది ఎన్నికల సమయంలో అధికారపార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదినే వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థికశాఖకు కూడా పైనుంచి ఆదేశాలు వెళ్లడంతో హడావుడిగా జీతాలు,పించన్లు చెల్లింపులు జరిగిపోయాయి.

➡️