ఇంటింటి ప్రచారానికీ అనుమతా? -పార్టీల తీవ్ర అభ్యంతరం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడానికి, కరపత్రాలు పంచడానికి కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరిఅంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పడంపై అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరాయి. ఎన్నికలకు సంబంధించిన అనుమతులు, ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ప్రవర్తనా నియమావళి, పార్టీలు అనుసరించాల్సిన నియమ నిబంధనల గురించి గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో సిఇఓ మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులతో పాటు ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీలకు కూడా ముందస్తు అనుమతులు తీసుకోవాలని చెప్పారు. దీనికోసమే సువిధ యాప్‌ను రూపొందించినటుంల తెలిపారు. కరపత్రాల పంపిణీకి, ఇంటింటి ప్రచారానికి కూడా ఈ యాప్‌ ద్వారా 48 గంటల ముందుగా సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఆన్‌లైన్‌ నామినేషన్లు, అఫిఢవిట్‌లను దాఖలు చేసేందుకు కూడా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చని చెప్పారు.
సిఇసి కూడా చెప్పలేదు : టిడిపి
కేంద్ర ఎన్నికల కమిషన్‌ కూడా ఈ తరహా ఆంక్షలను పెట్టలేదని టిడిపి తరపున హాజరైన బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సిఇసి మార్గదర్శకాల్లో కూడా ఇటువంటి నిబంధనలు లేవని చెప్పారు. ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. అధికార వైసిపి ప్రజలకు ఓట్ల కొనుగోలుకు తాయిలాలు పంచుతున్నారని, నేరుగా మసీదులోనే డబ్బు పంచుతున్న ఫోటోలను పెట్టినప్పటికీ ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఎలా వీలవుతుంది…? వైసిపి
ఇంటింటి ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలంటే ఎలా వీలవుతుందని ఈ సమావేశానికి హాజరైన వైసిపి నేత మల్లాది విష్ణు ప్రశ్నించారు. కరపత్రాలు పంపిణీ చేయాలన్నా అనుమతి తీసుకోవాలంటే కష్టమని చెప్పారు. డివిజన్‌ స్ధాయిలో చాలా మంది నేతలు రిటర్నింగ్‌ అధికారులనుండి అనుమతి తీసుకోవాల్సిఉంటుందని, ఇది సాధ్యం కాదని చెప్పారు. కరపత్రాలు పంచే విషయాన్ని కూడా 48గంటల ముందు నిర్ణయం తీసుకోవాలంటే ఎలా అని ప్రశ్నించారు.
పున:పరిశీలించాలి: సిపిఎం
ఎన్నికల్లో కరపత్రాల పంపిణీకి, ఇంటింటి ప్రచారానికి కూడా 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలన్న నిబంధనలను పున : పరిశీలించాలని సిపిఎం కోరింది. సమావేశానికి హాజరైన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరికిషోర్‌లు మాట్లాడుతూ ఈ నిబందన ఆచరణ సాధ్యం కాదన్నారు. రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేసిన జెండా పోల్స్‌, బ్యానర్లు తొలగించకుండా ఆదేశాలివ్వాలని, మేడే కార్యక్రమాల నిర్వహణకు ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుమతించాలని కోరారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు జెండాపోల్స్‌, జెండా దిమ్మెలు తొలగించిన అధికారులుపై చర్యలు తీసుకోవాలని, ఇతర జిల్లాల్లో తొలగించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. 2019లో పెట్టిన బైండోవర్‌ కేసుల పేరుతో పార్టీల కార్యకర్తలను స్టేషన్స్‌కు పిలిచి వేధించడం సరికాదని చెప్పారు.
.

➡️