విద్యారంగంలో వినాశకర పరిణామాలు

Dec 28,2023 13:38 #KS Laxmanrao, #maha sabha, #SFI
sfi state conference 2nd day ks laxmanrao
  •  ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : విద్యా రంగంలో వినాశకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యకు మరింత ప్రమాదకరమని కృష్ణా- గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కెఎస్. లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు గురువారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా లక్ష్మణరావు విచ్చేసి మాట్లాడుతూ విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న తాను 1972-82 మధ్యకాలంలో ఎస్ఎఫ్ఐలో పనిచేసే అనేక సమస్యలపై పోరాడామన్నారు. గుంటూరులో అధ్యాపకుడిగా వృత్తి నిర్వహించి మూడో సారి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కాలంలో నిబద్ధత, నిజాయితీగా పనిచేస్తున్నానని ఇందుకు ఎస్ఎఫ్ఐ నేర్పిన విలువలే కారణమని తెలిపారు.ప్రజా సమస్యల పట్ల, జీవితంలో విలువలతో ఎలా బ్రతకాలో నేర్పిందన్నారు. ఒక వ్యక్తిగా సమస్యలపై పోరాడే శక్తిగా ఎదగడానికి ఎస్ఎఫ్ఐ అనేక పాఠాలు నేర్పిందన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ దేశ స్వాతంత్ర్యం, సమానత్వం కోసం అనేక ఉద్యమాలు జరుపుతుందన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవ్, సుభాష్ చంద్రబోస్, సుందరయ్య వంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. అంబేద్కర్ నాయకత్వాన రచించబడిన రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య ఆవశ్యకత గురించి వివరించారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో విద్య ఉంది కాబట్టే నేటికీ పేదలు, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.1991లో పీవీ నరసింహారావు హయాంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ప్రభావం విద్య, ఆరోగ్య రంగాలపై పడిందన్నారు. దేశంలో 900 యూనివర్సిటీలు ఉంటే వాటిల్లో 450 యూనివర్సిటీలు ప్రైవేటు చేతుల్లోనే ఉన్నాయన్నారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు విచ్చలవిడిగా వచ్చాయన్నారు. ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ బాగా పెరిగిందన్నారు. కొఠారి కమిషన్ ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని సూచించిందన్నారు. ఎస్ఎఫ్ఐలో పని చేసే వారంతా కొఠారి కమిషన్ నివేదికను అధ్యయనం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలు మాదిరిగానే ప్రభుత్వ విద్యారంగాన్ని కూడా నాశనం చేస్తుందని దుయ్యబట్టారు.రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా బిజెపి ప్రభుత్వం ఎన్ఈపి-2020 ప్రకటించి అమలు చేస్తుండడం శోచనీయమన్నారు. ఎస్ఎఫ్ఐ వంటి ప్రగతిశీల విద్యార్థి సంఘాలు ఎన్ఈపి వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.విద్యపై కేంద్రం ఆదిపత్యం బాగా పెరిగిందన్నారు. విద్య మరింత ప్రైవేటీకరణ అవుతుందని, విద్యలో కాషాయీకరణ, మతతత్వం పెరుగుతుండడం ప్రమాదకరమన్నారు.నూతన విద్యా విధానం విద్యలో సాంఘిక సమానత్వానికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని వ్యతిరేకించగా ఏపీలో మాత్రం అమలు చేస్తూ ఉండడం సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో వినాశకర సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. 3,4,5 తరగతులను హైస్కూల్లో మెర్జ్ చేయడం వలన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని గుర్తు చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎఫ్ ఎమ్మెల్సీల పోరాటం ఫలితంగా 3 కిలోమీటర్లకు బదులు 1 కిలోమీటర్ వరకు మాత్రమే విలీనం చేశారన్నారు.
పాఠశాల విద్యను పరిరక్షించాలని కోరుతూ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అంతా బడి కోసం బస్సుయాత్ర నిర్వహించామని తెలిపారు. మంచి చెడులు ఆలోచించకుండా ఏపీ ప్రభుత్వం ఎన్ఈపిని అమలు చేయడం వలన ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు.

  • డిఎస్సి కోసం 4లక్షల మంది ఎదురు చూపులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ కూడా తీయలేదన్నారు. బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన సుమారు 4 లక్షల మంది డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వ యూనివర్సిటీ విద్య నానాటికి క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 5 వేల ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తక్షణమే వర్సిటీల్లో పోస్టులను భర్తీ చేసే విధంగా ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు, ఫీజులు, పిల్లల సంఖ్యపై నియంత్రణ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కూడా వీటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. అనుమతులు లేకుండా వేలాది మంది విద్యార్థులను ఈ యూనివర్సిటీలు విచ్చలవిడిగా చేర్చుకుంటున్నాయన్నారు. ఈ సమస్యలపై భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ మరిన్ని పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఉన్నత విద్యారంగానికి ఎంతో కృషి చేసిన ఎయిడెడ్ కళాశాలలను గత, ప్రస్తుత ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ఎయిడెడ్ ను నిర్లక్ష్యం చేసాయన్నారు. ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాల పోరాటం ఫలితంగా రాష్ట్రంలో 50 కాలేజీలు అన్ ఎయిడెడ్ కాకుండా ఉన్నాయన్నారు. విద్యారంగ పరిరక్షణకు భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ చేయబోయే ఉద్యమాలకు పిడిఎఫ్ గా తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

sfi state conference 2nd day ks laxmanrao

➡️