సింపుల్‌ గవర్నమెంట్‌… ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌

-ఇదే మా ప్రభుత్వ విధానం
-ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు : ముఖ్యమంత్రి చంద్రబాబు
– కుప్పంలో ముగిసిన రెండు రోజుల పర్యటన
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :సింపుల్‌ గవర్నమెంట్‌… ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ తమ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కుప్పం నుంచే పేదరిక నిర్మూలనకు శ్రీకారం చుడుతున్నామన్నారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదరికంలేని గ్రామం, పేదరికంలేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. గత పాలనకు, ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంటుందని ఉద్ఘాటించారు. అధికారులు ఫిజికల్‌గానూ, వర్చువల్‌గానూ పనివిధానాలకు సిద్ధపడాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు బుధవారం కూడా ప్రజలను నుంచి అర్జీలను చంద్రబాబు స్వీకరించారు. అనంతరం కుప్పం అతిథి గృహంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్ద మీటింగ్‌లు, భారీ కాన్వారులు, సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండబోవన్నారు. సాయంత్రం ఆరు గంటల తరువాత సమావేశాలు వద్దని ఇప్పటికే మంత్రులకు చెప్పినట్లు తెలిపారు. అధికారులు ఫాస్ట్‌గా రియాక్ట్‌ అయ్యి, ఎఫెక్టివ్‌గా కార్యక్రమాలు చేయాలని సూచించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కనిపించకూడదన్నారు. రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గత ఐదేళ్లూ అధికారులు మనసు చంపుకుని పనిచేశారని, వైసిపి నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారని పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గానికి తాను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత ఐదేళ్లలో కల్పించారని అన్నారు. తనపై హత్యాయత్నం కేసు పెట్టారని వివరించారు. గత ఐదేళ్లలో అనేక అక్రమ కేసులు పెట్టారన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం తీసుకొస్తానన్నారు. ఎన్‌టిఆర్‌ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించి తాగునీటి సమస్య పరిష్కరిస్తానని, హంద్రీనీవా కాలువ పనుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలని, డెయిరీ, మిల్క్‌, సిల్క్‌, హనీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కుప్పానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తెస్తామని, కుప్పాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌ చేస్తామని అన్నారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. రైతులకు సబ్సిడీలు అందించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి డిపార్టుమెంట్‌ నుంచి పక్కా ప్రణాళికతో రావాలని, నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలని ఆదేశించారు. రెండో రోజు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా చంద్రబాబుకు 846 అర్జీలు అందాయి. వాటిని పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.
‘చరణి’గా చిన్నారికి నామకరణం
శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్‌, ప్రియ దంపతుల రెండో కుమార్తెకు ‘చరణి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నామకరణం చేశారు. బుధవారం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజలు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఈ దంపతులు తన కుమార్తె చిన్నారికి నామకరణం చేయాలని కొరగా, ముద్దులలికే ఆ పాపకు చరణి అని చంద్రబాబు పేరు పెట్టారు.

➡️