ఇన్ని దరఖాస్తులా…?

Dec 23,2023 10:27 #applications, #many
  • ఫారం-7ల పై సిఇసి విస్మయం
  • సరిచేయాలని సమీక్షలో సూచన
  • నేడు కూడా కొనసాగనున్న సమావేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓట్ల తొలగింపునకు (ఫారం-7) అందిన దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం విస్మయం వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో అందిన ఫిర్యాదులపై పరిశీలించేందుకు వచ్చిన ఎన్నికల సంఘం ప్రతినిధులు విజయవాడలోని ఒక హోటల్‌లో జిల్లాల కలెక్లర్లు, ఎస్‌పిలు, సిఇఒలతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష ప్రారంభంలోనే ఫారం-7 దరఖాస్తులకు సంబంధించిన నివేదికలు చూసిన సిఇసి అధికారులు ‘ఇన్ని దరఖాస్తులా…’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు, ‘అసలేం జరుగుతోంది ఇక్కడ…’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత 90లక్షల దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వీటిలో 89 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని, మిగిలిన వాటిని 26వ తేదీలోగా పరిష్కరిస్తామని చెప్పారు. సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనరు ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలు లేకుండా ఉండటం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరు ఓటు వేసేలా రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడాలని, ప్రజాస్వామ్యంలో అదే అత్యంత కీలకమని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో తక్కువ ఓట్లు నమోదవుతున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మొదటి రోజు సమీక్షా సమావేశంలో సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌వ్యాస్‌ల నేతృత్వంలోని బృందం సభ్యులు స్వీప్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అజ్మేరా, అండర్‌ సెక్రటరీ సంజరుకుమార్‌, రాష్ట్ర జాయింట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసరు ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ హాజరయ్యారు. శనివారం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలతో సమావేశం కొనసాగనుంది.

➡️