వైసిపి పాలనలో రాష్ట్రం అప్పులపాలు

  •  ‘స్వర్ణాంధ్ర సాధికార యాత్ర’లో బాలకృష్ణ

ప్రజాశక్తి – ఎమ్మిగనూరు రూరల్‌ (కర్నూలు) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.పది లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని టిడిపి నాయకులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ఓటు అనే ఆయుధంతో ఈ పాలనను సాగనంపాలని కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఇక్కడ తన సినిమాలు అత్యధిక రోజులు ఆడాయని తెలిపారు. ఆయన చేపట్టిన ‘స్వర్ణాంధ్ర సాధికార యాత్ర’ ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట, శివ సర్కిల్‌, సోమప్ప సర్కిల్‌, మార్కెట్‌ కమిటీ వరకూ సాగింది. ఆయా చోట్ల బాలకృష్ణ మాట్లాడుతూ.. నాడు తన తండ్రి ఎన్‌టి.రామారావు టిడిపిని స్థాపించి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని, తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నో సంస్కరణలు తెచ్చి గొప్ప పరిపాలన అందించారని అన్నారు. వైసిపి పాలనలో అందరూ కష్టాలు అనుభవించారని, ఈ పాలన పోవాలంటే ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని ప్రజలను కోరారు. టిడిపి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి, కర్నూలు ఎంపి అభ్యర్థి పంచలింగాల నాగరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎంపి సంజీవ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️