పేదల ఇండ్ల కోసం పోరాటం – సిపిఎం నాయకుల గృహనిర్బంధం

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : పేదలకిచ్చే ఇండ్లను సుదూర ప్రాంతాల్లో కాకుండా వారికి ఉపాధి కలిగే ప్రాంతాల్లోనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ … నిరసన చేపట్టిన సిపిఎం నేతలను పోలీసులు సోమవారం గృహనిర్బంధం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో… ”ఎక్కడో సుదూర ప్రాంతమైన చిందేపల్లెలో ఇండ్లు వద్దు మా ఉమ్మడి శెట్టిపల్లెలోనే ఇవ్వండి ” అని డిమాండ్‌ చేసిన సిపిఎం తిరుపతి నగర కార్యదర్శి వర్గ సభ్యులు వేణుగోపాల్‌ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

సిపిఎం నేత వేణుగోపాల్‌ మాట్లాడుతూ … తుడా క్వార్టర్స్‌ లో గతంలో జగనన్న ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన స్థలంలోనే పేదలకు ఇండ్లను ఇవ్వాలని కోరారు. ఇక్కడి ప్రజలు ఇక్కడే బతుకుతెరువు చేసుకుంటూ సొంత ఇల్లును పొందుతారని అన్నారు. జగనన్న ఇంటి పట్టాల లబ్ధిదారుల గొంతుక వినిపించి, ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీలోని చెన్నాయి 195/2 లో ఉన్న 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలంలో ఎర్రజెండాలు పాతడానికి బయలుదేరిన సిపిఎం నాయకులను పోలీసులు అర్థరాత్రి వేళల్లో హౌస్‌ అరెస్టులు చేయడం దుర్మార్గం అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో కనీస హక్కుల కోసం పోరాడుతుంటే పోలీసులతో అణిచివేయాలని చూడడం సిగ్గుమాలిన చర్య అని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఓ ప్రకటనలో అన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యల వల్ల ఉద్యమాలను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు.

➡️