సుప్రీం తీర్పు రాష్ట్రానికి నష్టం : సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు కూడా తీరని నష్టం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌కు ఆ హోదా తొలగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం విచారకరమని పేర్కొన్నారు. ఈ తీర్పు జమ్ముకాశ్మీర్‌కే కాకుండా రాష్ట్రానికి కూడా తీరని నష్టం చేస్తుందని తెలిపారు. ‘2014 రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. కానీ, మోడీ నాయకత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసింది. ఇప్పుడు ఈ తీర్పును అడ్డం పెట్టుకుని బిజెపి ప్రభుత్వం మరోసారి శాశ్వతంగా మోసం చేసే అవకాశం ఉంది. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు నష్టదాయకం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రజలకు ముఖ్యంగా విద్యార్థి, యువజనులకు సుప్రీంకోర్టు తీర్పు ఆశాభంగం కలిగిస్తోంది. ఈ తీర్పు పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.’ అని తెలిపారు.

➡️