కులవివక్ష చూపుతున్న వారిపై చర్యలు తీసుకోండి

Dec 4,2023 21:27 #KVPS
  • ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌కు కెవిపిఎస్‌ వినతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: దళితుల పట్ల కులవివక్ష చూపుతున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లప్ప, అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం బెణకల్‌ గ్రామంలో దళితుల పట్ల కులవివక్ష, అంటరానితనాన్ని పాటిస్తూ దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆధిపత్య అగ్రకులహంకారుల దుర్మార్గమైన చర్యలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో తిరుణాళ్లకు డబ్బులు ఇవ్వలేదని దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామాన్ని సందర్శించి న్యాయం చేయాలని కోరారు. నవంబరు 27, 28, 29 తేదీల్లో గౌరీమాత పండగ సందర్భంగా జరిగిన ఎద్దుల పోటీల్లో దళితుల పట్ల కులవివక్ష చూపుతూ గౌరీమాత ఆలయంలోకి అనుమతించకుండా అవమాన పరిచిన అగ్రవర్ణ పెత్తందార్లపై చర్య తీసుకోవాలన్నారు.

➡️