పోస్టల్‌ బ్యాలెట్‌పై స్పష్టత ఇవ్వాలి : ఇసికి టిడిపి వినతి

May 4,2024 21:56 #BJP, #CM RAMESH, #YCP
varla ramaiah comments on jagan

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై అధికారులకు స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను టిడిపి కోరింది. సచివాలయంలో మీనాను టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వర్ల మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంలో ఇంకా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, సిఇఒ డైరెక్షన్‌లు జిల్లా కలెక్టర్లకు అర్థమవ్వడం లేదని అన్నారు. ఫార్మ్‌-12డి ఎన్‌రోల్‌మెంట్‌ ఏప్రిల్‌ 30తో ఆపేశామంటున్నారని, కానీ 1వ తేదీ తర్వాత కూడా ఎన్నికల విధులకు ఉద్యోగులను తీసుకెళ్తున్నారని చెప్పారు. వారికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెజిటెడ్‌ స్టాంప్‌ ఉందా లేదా అని చూసుకోకుండా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరిపారని, ఈ ఓట్లు ఇన్‌వాలిడ్‌ కాకుండా చూడాలని కోరారు. సిఇఒను కలిసిన వారిలో ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఉన్నారు.

అమెరికా కంపెనీకి ప్రజల ఆస్తుల వివరాలు : విజయ్ కుమార్‌
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం పేరుతో సిఎం జగన్‌ ప్రజల ఆస్తుల వివరాలను అమెరికాలోని క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ చేతిలో పెట్టారని టిడిపి అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్‌ ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్‌ వెబ్‌సైట్‌లో ప్రజల ఆస్తులను దాచి పెడుతున్నారని, దీనిపై జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రయోజనాల సిఎం జగన్‌, సిఎస్‌ జవహర్‌రెడ్డి పింఛను దారుల ప్రాణాలు తీస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మరో సమావేశంలో విమర్శించారు.

➡️