ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల

  • ఇరిగేషన్‌ శాఖలో అవినీతిపై ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో బ్యారేజీ కుంగిందన్నారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పూర్తి దెబ్బ తిందన్నారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేళ్లలోనే కుప్పకూలిందన్నారు. గత పదేళ్లలో ఇరిగేషన్‌ శాఖలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారన్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం రూ.1800 కోట్లకు టెండర్లు పిలిచి.. అంచనా వ్యయం రూ.4500 కోట్లకు పెంచారన్నారు. ఇంత అవినీతి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగలేదన్నారు. గత ఏడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ కుంగితే.. మేం అధికారంలోకి వచ్చే వరకు ఏ ఒక్కరోజు కూడా మాజీ సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై స్పందించలేదన్నారు. ప్రాజెక్టులపై సలహాలు, సూచనలు ఇచ్చే అధికారం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీకి (ఎన్‌డీఎస్‌ఏ) ఉందని.. ప్రణాళిక, డిజైన్‌, పర్యవేక్షణ లోపం కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్‌ అయిందని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో స్పష్టంగా చెప్పిందన్నారు. అన్నారం బ్యారేజీకి ఈ తరహా ప్రమాదం పొంచి ఉందని నివేదికలో తెలిపిందని ఉత్తమ్‌ అన్నారు.

➡️