పిఠాపురంలో ఉద్రిక్తత – సాయిధరమ్‌ తేజ్‌ ప్రచారంపై దాడి : జనసేన కార్యకర్తకి తీవ్రగాయాలు

ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : జనసేన అధినేత కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌ కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గొల్లప్రోలు మండలం తాడిపర్తిలో వైసిపి వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. సాయి ధరమ్‌ తేజ్‌ కాన్వారు ముందుకు వెళుతున్న సమయంలో… గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీ డ్రింక్‌ బాటిల్స్‌ను విసరడంతో సాయి ధరమ్‌ తేజ్‌ తఅటిలో తప్పించుకున్నారు. తాటిపర్తి గ్రామానికి చెందిన జనసైనికుడు ఎన్‌.శ్రీధర్‌ తలకు తీవ్రగాయమయ్యింది. ఈ ఘటనలతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ కు మద్దతుగా సాయి ధరమ్‌ తేజ్‌ ప్రచారం నిర్వహించేందుకు తాటిపర్తి వస్తున్నాడంతో భారీగా జనసైనికులు స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. సదరు కూడలిలో మాట్లాడి చిన్న జగ్గంపేట గ్రామానికి రోడ్డు షో గా వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేలోపు వైసీపీ వర్గీయులు టపాకాయలు కాల్చి కవ్వింపు చర్యలకు దిగడంతోపాటు నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. కాన్వారు పై గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీ కూల్‌ డ్రింక్‌ సీసాలు విసిరారు. జన సైనికుడు నల్లాల శ్రీధర్‌ కి తలకు తీవ్ర గాయం అయింది. హుటా హుటానా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఇరువర్గాలను పంపించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖాళీ డ్రింక్‌ సీసా తనకు తగిలినట్టు గాయపడిన శ్రీధర్‌ తెలిపాడు. సాయిధరమ్‌ తేజ్‌ పర్యటనకు భారీ స్పందన రావడం తట్టుకోలేక వైసీపీ ఈ దాడికి పాల్పడినట్లు జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దాడిలో గాయపడి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసైనికుడిని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు. ఓటమి భయంతోనే వంగా గీత వైసిపి వర్గీయులు ఈ దాడులకు పాల్పడుతున్నారని జనసేన నేతలు ఆరోపించారు. దాడి చేసిన వారిని సోమవారం నాటికి అరెస్ట్‌ చేయకపోతే, జిల్లా ఎస్పీ, గొల్లప్రోలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాలు చేస్తామని జనసేన శ్రేణులు ప్రకటించారు.

➡️