ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్నితక్షణం రద్దు చేయాలి

  • ప్రజా సంఘాల సదస్సు డిమాండ్‌

ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా స్థాయి ప్రజా సంఘాల సదస్సు డిమాండ్‌ చేసింది. ఈ చట్టం అమలులోకి వస్తే ఆస్తులపై హక్కు కోల్పోవడమే కాకుండా ఆస్తి అంతా మరొకరి చేతుల్లోకి వెళ్తుందని, దీన్ని అంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. ఇది ప్రజలు, న్యాయవాదుల సమస్య మాత్రమే కాదని, అందరి సమస్యగా భావించాలని కోరింది. భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజాసంఘాల సదస్సు సోమవారం జరిగింది. ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ.. ఈ చట్టం పూర్తిగా సామాన్య ప్రజలకు విరుద్ధమైందన్నారు. ప్రజలు తమ ఆస్తి హక్కును కాపాడుకోవడానికి పలు చట్టాలు అమలులో ఉన్నాయన్నారు. ఏవైనా వివాదాలు ఏర్పడినప్పుడు ఉన్న చట్టాల ద్వారా తమ ఆస్తులను రక్షించుకోగలుగుతున్నారని తెలిపారు. వాటన్నింటినీ కాదని కొత్తగా తీసుకొచ్చిన చట్టం వల్ల భూవివాదాల్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మొగళ్ల వెంకట రమణారావు మాట్లాడుతూ భూవివాదాలను పరిష్కరించే బాధ్యతను న్యాయస్థానాల నుండి తప్పించి రెవెన్యూ అధికారులకు అప్పగించడం అర్థరహితమన్నారు. ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, ఎపి రైతు సంఘం జిల్లా సీనియర్‌ నాయకులు చింతకాయల బాబూరావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించలేని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బురిడి వాసుదేవరావు, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కారుమంచి క్రాంతిబాబు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.ధనుష్‌, న్యాయవాదులు, ఐలు నాయకులు పాల్గొన్నారు.

➡️