కనీస వసతులు కూడా లేవు : పోలింగ్‌ సిబ్బంది ఆగ్రహం

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : స్థానిక గణపవరం సి.ఆర్‌. కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి, తదితర వాటి గురించి ఏర్పాటు చేసే విషయంలో ఉద్యోగులందరు అసౌకర్యానికి గురయ్యారు. ఈ నెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా చిలకలూరిపేట సిఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పోలింగ్‌ సిబ్బందికి సామాగ్రి తదితర ఏర్పాట్లను చేశారు. అయితే ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో పోలింగ్‌ సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్‌ అయ్యారని ఉద్యోగస్తులు అంటున్నారు. పోలింగ్‌ సిబ్బంది సరైన కుర్చీలు, టిఫిన్‌ లేక భోజనాలు లేక కిందనే కూర్చోవడంతో అనేకమంది మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొంతమందికి సరైన మంచినీటి సౌకర్యాలు, బాత్‌ రూంలు లేవని పోలింగ్‌ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సుమారుగా 2300 మంది హాజరయ్యారు. దీనికిగాను కోటి ముప్పై లక్షల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు సామాగ్రి చేరుస్తారు.

➡️