ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

  •  మేడే వేడుకల్లో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు

ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : నేడు దేశంలోని ప్రభుత్వ రంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. మేడే సందర్భంగా గాజువాకలోని 60 అడుగుల రోడ్డులో బుధవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చివేసే ప్రయత్నం మోడీ హయాంలో జరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ఇలానే వ్యవహరించగా మూడు నెలల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ మాటతప్పారన్నారు. యువతను తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు. ఒక్క రైల్వేలోనే 3,23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆర్మీలో కొత్త ఉద్యోగాలు లేకుండా చేశారని, కార్మిక చట్టాలను ఎత్తేసి నాలుగు లేబర్స్‌ కోడ్‌లను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన మోడీ సర్కారుకు రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం దారుణమన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రుణాల మాఫీ చేస్తోందని, ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు ప్రయత్నిస్తున్న వారికి, వారికి మద్దతు తెలుపుతున్న పార్టీలకు కార్మికవర్గం బుద్ధిచెప్పనుందన్నారు. పోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించుకోగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ పి.మణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీకన్య థియేటర్‌ జంక్షన్‌ నుంచి పాత గాజువాక జంక్షన్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.

➡️