నష్టాన్ని మిగిల్చిన వాన .. వరి నూర్పిడి చేసిన రైతుల్లో ఆందోళన

Dec 5,2023 11:33 #farmers, #loss, #Rain effect

ప్రజాశక్తి-చాపాడు (కడప) : ఆరు కాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మిచౌంగ్‌ తుఫాన్‌ రూపంలో వర్షం రావడంతో పంటలు నేలకొరుగుతున్నాయి. మండల పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి, ఈదురు గాలులకు వరి పంట చాలా వరకు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతున్నది. మంగళవారం ఉదయం వరి నూర్పిడి చేస్తున్న రైతులు తమ ఆవేదనను ప్రజాశక్తితో చెప్పుకున్నారు.

మండల వ్యాప్తంగా కెసి, కుందూ, పెన్నా పరిధిలో 4 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. అయితే పెన్నా, కుందూ పరివాహక గ్రామాలలో సాగు చేసిన వరి పంట వెయ్యి ఎకరాల వరకు నూర్పిడి చేశారు. నూర్పిడి చేసిన వరి ధాన్యం కాపాడుకునే ప్రయత్నం లో రైతులు నిమగమయ్యారు. రోడ్లు, సురక్షిత ప్రాంతంలో ప్లాస్టిక్‌ పట్టాలను కప్పి వరి ధాన్యం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యవారిపల్లి, తిమ్మాయిపల్లి ,రాజువారి పేట, పల్లవోలు ,సీతారామపురం, కుచ్చు పాప, రామసుబ్బమ్మ కొట్టాలు, వెదురూరు గ్రామాల పరిధిలో వరి పంట నూర్పిడి దశలో ఉన్నది. ఖాధర్‌ పల్లె, సోమాపురం, అయ్యవారిపల్లి, రామదాసు పురం, తిమ్మాయిపల్లి గ్రామాల వద్ద వరి పంట అధికంగా నేలకొరిగింది .వరి ధాన్యం వర్షపునీటిలో తడిస్తే మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 వేల ఎకరాలలో పంట నూర్పిడి దశలో ఉన్నది. పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో దెబ్బతింటుంటే ఏమీ చేయలేని పరిస్థితులలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వర్షంలోనే వరి కోత యంత్రాల ద్వారా నూర్పిడి పనులు చేపడుతున్నారు. ఎకరా సాగుకు రూ.30 వేల వరకు ఖర్చులు అయ్యాయని ప్రస్తుతం వర్షానికి ధాన్యం దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం తగ్గుముఖం పట్టకపోతే పంట పూర్తిగా దెబ్బతింటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 32 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తున్న సమయంలో వర్షాలతో పంట దెబ్బతినడంతో నష్టాలు తప్పవని రైతులు కంటతడిపెడుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం అధిక వర్షాలతో వరి రైతులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు చాలా వరకు తగ్గినది. ఈ పరిస్థితులలో కూడా పంట చేతికి వచ్చిన దశలో వర్షం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు ఆర్‌ బి కే ల పరిధిలో ఉన్న తమ సిబ్బంది కలిసి దెబ్బతింటున్న పంటల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలు నమోదుకు అవకాశం ఇచ్చి నష్ట పరిహారం అందించాలని రైతన్నలు కోరుతున్నారు.

➡️