ఐదో రోజుకు గంగవరం పోర్టు కార్మికుల పోరాటం – సిపిఎం సంఘీభావం

గంగవరం పోర్టు (విశాఖ) : అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు, జిపిఎల్‌, జిపిఎస్‌ పర్మినెంట్‌ కార్మికులతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికులు, లోడిరగ్‌, అన్‌లోడింగ్‌, ట్రాన్స్‌ పోర్టు, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఆపరేటర్స్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్‌ చేశారు. గత 5రోజులుగా అదానీ గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద నిరసన నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ … అదానీ గంగవరం పోర్టు కార్మికులకు ఇతర పోర్టులలాగా కనీస వేతనం రూ.36 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సుమారు మూడు వేల మందికి పైగా పనిచేస్తున్న గంగవరం పోర్టును షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చి కార్మికులకు వేతనాలు పెరగకుండా, కార్మిక చట్టాలు అమలు కాకుండా ద్రోహం చేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ చట్టంలోకి తీసుకురాకుండా గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగించి నేడు బిజెపితో కలిసి అదానీకి గంగవరం పోర్టును కట్టబెట్టడాన్ని తీవ్రంగా విమర్శించారు. గతంలో 64 రోజులుపాటు తామంతా సమ్మెచేస్తే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, యాజమాన్యం కలిసి కార్మికుల డిమాండ్లను పరిష్కారిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. అదానీ గంగవరం పోర్టులో ఎరువులు, బగ్గు, రసాయన విషపదార్ధాల మధ్య కార్మికులు పనిచేయడం వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కార్మికులే కాకుండా గాజువాక, మల్కాపురం పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పోర్టు కాలుష్యానికి బాధితులయ్యారన్నారు. పోర్టు కాలుష్యాన్ని తక్షణం అరికట్టి, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. పోర్టులో పనిచేస్తున్న క్రమంలో కార్మికులు చనిపోతే ఆందోళనలు చేస్తేగాని యాజమాన్యం నష్టపరిహారం చెల్లించడం లేదన్నారు. గత ఒప్పందం ప్రకారం మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. గంగవరం పోర్టు నిర్మాణం వలన నిర్వాసితులు తమ భూములు, వేట, ఉపాధిని కోల్పోయారని గుర్తుచేశారు. అలాంటి నిర్వాసితులకు నేడు న్యాయం చేయకుండా టిడిపి, వైసిపి, బిజెపి, జనసేన పార్టీలతోపాటు అదానీ యాజమాన్యం కార్మికుల శ్రమను దోచుకొని లాభాలు సంపాదిస్తోందన్నారు. తక్షణమే నిర్వాసిత కార్మికులకు, పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉదఅతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్‌, నాయకులు పి.వెంకటరెడ్డి, జి.వి.ఎన్‌.చలపతి, జి.అప్పలరాజు, ఎం.సూరీడు, జి.వి.రమణ, అనపర్తి అప్పారావు, వి.నరేంద్రకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️