మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తి దాయకం

  • సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ
  • జైల్‌ నుంచి విడుదలైన వారికి ఘన స్వాగతం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ మిమ్స్‌ యాజమాన్య నిరంకుశత్వాన్ని, పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొని జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలైన సిఐటియు నాయకులకు, మిమ్స్‌ ఉద్యోగులకు గురువారం సాయంత్రం ఘన స్వాగతం లబింóచింది. విజయగనరం సబ్‌జైలు బయట ప్రజాసంఘాల నాయకులు, మిమ్స్‌ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున పోరాడారు. కక్ష కట్టిన యాజమాన్యం తప్పుడు కేసులు పెట్టి 23 మందిని అరెస్టు చేయించింది. వారిలో ఐదుగురిని విశాఖ సెంట్రల్‌ జైలుకు పంపగా, మిగతా 18 మంది విజయనగరం సబ్‌జైలులో ఉంచారు. వీరిలో నలుగురు ఈ నెల 13న విడుదల కాగా, మిగతా వారంతా గురువారం విడుదలయ్యారు. విడుదలైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, మిమ్స్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ, నాయకులు కామునాయుడు, బంగారు నాయుడు, డివి రమణ మూర్తి, నాగభూషణం, రామకృష్ణ, మధుసూదనరావు, గౌరీతో పాటు మొత్తంగా 19 మంది ఉన్నారు.
వీరికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మా పూలమాల వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాజమాన్యం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఉద్యోగం నుంచి తొలగించినా, చివరకు జైలుకు పంపినా పట్టువదలకుండా ఉద్యోగులంతా సిఐటియు ఆధ్వర్యాన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. మిమ్స్‌ ఉద్యోగుల పోరాట ఫలితంగా నేడు యాజమాన్యం అగ్రిమెంట్‌ చేసుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని కోరారు. 14 రోజులపాటు జైలులో ఉండి కార్మికుల కోసం పోరాడి విడుదలైన వారికి ఆమె అభినందనలు తెలిపారు. స్వాగతం పలికిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శులు ఎ.జగన్మోహనరావు, బి.రమణ, ఉపాధ్యక్షులు బి.సుధారాణి, ఎస్‌ అనసూయ, నాయకులు బి.పైడిరాజు, కె.త్రినాథ్‌, మిమ్స్‌ ఉద్యోగులు ఉన్నారు.

➡️