వామపక్షాలతోనే పేదల అభ్యున్నతి

May 10,2024 08:37 #AP, #cpm pracharam

– వాడవాడలా సిపిఎం అభ్యర్థుల ప్రచారం
ప్రజాశక్తి-యంత్రాంగం :పేదలు.. మహిళలు.. యువత.. అన్నదాతల అభ్యున్నతి వామపక్ష అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని, మానవత్వంలేని బిజెపి, టిడిపి, జనసేన, వైసిపిలను ఓటుతో తరిమి కొట్టాలని సిపిఎం నేతలు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలు చేశారు. పలుచోట్ల బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రజల బతుకులకు భరోసా కావాలంటే సిపిఎంను గెలిపించుకోవాల్సిన అవసరముందని తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి రమణకు, అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్సకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి పాల్గన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. తమ గ్రామాలకు కనీసం రహదారి సదుపాయం లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తాగునీరు కూడా అందని పరిస్థితి ఉందని, కలుషిత నీరు తాగడంతో ప్రతి సీజన్లోనూ విష జ్వరాల బారినపడి పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పుణ్యవతి స్పందిస్తూ కురుపాం నియోజవర్గ ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా స్థానిక ఎమ్మెల్యేకు పట్టకపోవడం దారుణమన్నారు. పూర్ణపాడు-లాబేసు వంతెన, తోటపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. గిరిజనుల బతుకులకు భరోసా కల్పించాలంటే నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, ఎంపి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని కోరారు.

కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు, నన్నూరు, ఉలిందకొండలో పాణ్యం అభ్యర్థి డి.గౌస్‌దేశారుకు మద్దతుగా ప్రచారంలో సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్‌రెడ్డి పాల్గన్నారు. రోడ్‌షో, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.మధు మాట్లాడుతూ.. దేశాన్ని పదేళ్లపాటు పాలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసింది శూన్యమేనని అన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతోపాటు నిరుద్యోగ సమస్య తీవ్రతరమైందని తెలిపారు. బిజెపి చేసింది ఏమిలేకపోవడంతో ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొడుతోందని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందన్నారు. ప్రతిపక్షాలను కట్టడిచేసేందుకు ఇడి, ఆదాయపు పన్ను శాఖలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బిజెపితో జతకట్టిన టిడిపి, జనసేన పార్టీలు తోడు దొంగలేనన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో ఇసుక, మద్యం దోపిడీ పేరుతో పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పార్టీలను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థును గెలిపించాలని కోరారు. పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య స్మారక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

విజయవాడలోని 23, 24 డివిజన్లలో సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి చిగురుపాటి బాబూరావు ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పలేదని, భవిష్యత్తులో ఏమి చేస్తారో ప్రకటించలేదని తెలిపారు. విభజన చట్టం ప్రకారం విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో రైలు, రైల్వే జోన్‌ ఇవ్వాల్సి ఉందని, వాటి గురించి మాట్లాడకుండా బుల్లెట్‌ రైలు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జగన్‌ అవినీతి పాలనను నిసిగ్గుగా రక్షించింది బిజెపినేనని విమర్శించారు. నీతివంతమైన రాజకీయాలు నడుపుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి, దుర్గాపురం, అజ్జంపూడి బుద్దవరం, బూతుమిల్లిపాడు గ్రామాల్లో ఆ నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి రాజధాని కావాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి కావాలన్నా ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపుతోనే సాథ్యమని తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలని కోరారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో మంగళగిరి అభ్యర్థి జన్న శివశంకరరావు ప్రచారం నిర్వహిస్తూ వ్యవసాయ రంగంలో భూ యజమాని హక్కు పరాధీనమయ్యే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసేంత వరకు పోరాడతామని తెలిపారు. భూ యజమాని తన భూమి తనదని నిరూపించుకోవాలంటే హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని, ఇటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతులు, పేదల కోసం పోరాడేది సిపిఎం అని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం తనను ఆదరించాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పోతంగి, ముంచంగిపుట్టు మండలం బరడ, జి.మాడుగుల మండలం సొలభం గ్రామాల్లో అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్సను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం నాయకులు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.
నెల్లూరులోని 3, 4 డివిజన్ల పరిధిలో నగర నియోజకవకవర్గ అభ్యర్థి మూలం రమేష్‌ ప్రచారం నిర్వహించారు. నెల్లూరు నగరాభివృద్ధికి తనన గెలిపించాలని కోరారు.

➡️