రూ. 5,141.74 కోట్లతో టిటిడి వార్షిక బడ్జెట్‌

Jan 29,2024 20:06 #Council, #ttd, #TTD EO
ttd council meeting decisions
  • కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంపు
  • టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశం నిర్ణయాలను మీడియాకు కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. టిటిడి పోటు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డూ ట్రే లిఫ్టింగ్‌ సెమీ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులను స్కిల్డ్‌ కార్మికులుగా మార్పు చేసి వారి వేతనాలను రూ.12,523 నుంచి రూ.15 వేలకు పెంచేందుకు ఆమోదం తెలిపామన్నారు. అన్నదాన విభాగంలో 138 మంది క్లీనర్లు, 79 మంది వంట మనుషులను స్కిల్డ్‌ కేటగిరీలోకి మార్చి వారి వేతనాలను రూ.17 వేల నుంచి రూ.22 వేలకు, ఎలక్ట్రికల్‌, వాటర్‌ వర్క్స్‌ విభాగాల్లో పనిచేసే కార్మికులను అన్‌స్కిల్డ్‌ నుంచి స్కిల్డ్‌ కేటగిరీలోకి మార్పు చేసి వేతనాలు పెంచామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో వివిధ దేవతామూర్తుల శిల్పాలను తయారుచేస్తున్న శిల్పుల కళానైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, వారి వేతనాల పెంపుదలకు ఆమోదం తెలిపామన్నారు. కలంకారి కళలో నిపుణులైన మునస్వామిరెడ్డి వేతనం రూ.25 వేల నుండి రూ.39 వేలకు, టిటిడి అనుబంధ, విలీన ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకుల వేతనాలను రూ.26 వేల నుంచి రూ.31 వేలకు, టిటిడి స్టోర్‌లో పనిచేసే తొమ్మిది మంది వర్కర్ల వేతనం రూ.తొమ్మిది వేల నుండి రూ.15 వేలకు పెంచినట్లు తెలిపారు. వీరితో పాటు మరికొందరికి వేతనాలు పెంచినట్లు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 227 వేదపారాయణందారు, అధ్యాపక, మేళం సిబ్బంది పోస్టులు, విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 అర్చక, పరిచారిక, పోటు వర్కర్‌, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్‌, వేదపారాయణందారు, మేళం సిబ్బంది పోస్టుల భర్తీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ సమావేశంలో టిటిడి ఇఒ ఎవి.ధర్మారెడ్డి, జెఇఒలు సదా భార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు.

ఫారెస్టు కార్మికుల సమస్యను పరిష్కరిస్తాం : చైర్మన్‌

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఫారెస్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. అటవీ కార్మికుల సమస్యను విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. టిటిడి ఫారెస్టు కార్మికుల సమస్యను మానవతా దృక్పధంతో ఆలోచిస్తున్నామని, వారి సమస్య పరిష్కారానికి ముగ్గురు టిటిడి ఉన్నతాధికారులతో హైలెవల్‌ కమిటీని నియమించినట్లు చెప్పారు. మంగళవారం ఫారెస్టు కార్మికులతో, యూనియన్‌ నాయకులతో సంప్రదించి, వారి డిమాండ్లను కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించి న్యాయబద్దంగా సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.

➡️