ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

Mar 18,2024 11:52 #Deaths, #Prakasam District, #swimming

ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశంజిల్లా) : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. పెద్దదోర్నాల మండలంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన కొండెబోయిన ప్రసన్న కుమార్‌ (12) దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి, దూదేకుల వలి(9) దోర్నాల మండల పరిషత్‌ పాఠశాల (మెయిన్‌) నాల్గవ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఈత కొట్టేందుకు సమీప యడవల్లి గ్రామ సమీపంలోని బలిజేపల్లి దారిలోని జీరుకొండ పైనున్న క్వారీ గుంత వద్దకు వెళ్లారు. ఒడ్డున ఈత ఆడుకుంటూ లోతుల్లోకి వెళ్లిపోయారు. బయటకు రాలేక ఊపిరాడక ఇద్దరూ మరణించారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి క్వారీ గుంతలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వలిగా గుర్తించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గట్టుపైన రెండు జతల దుస్తులు, రెండు జతల చెప్పులు ఉండడంతో మరో మృతదేహం కూడా క్వారీలో ఉండవచ్చని భావించారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రసన్న కుమార్‌ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️