ఉపాధి పనులు కల్పించాలని ధర్నా

Feb 26,2024 20:42 #Dharna, #Eluru district, #upadhi

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఉపాధి కార్మికులు, మహిళలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్మదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ పనులు చేసుకునే కార్మికులకు, రోజువారి పనికి వెళ్తేనే పూటగడుస్తుందని తెలిపారు. సొంత గ్రామంలోనే ఉపాధి దొరికే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేదలకు ఉపాధి కరువైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఏలూరు చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామ పంచాయతీలను ఏలూరు నగరంలో విలీనం చేయడంతో ఉపాధి హామీ పనులు లేకుండాపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోణంగి, కొమడవోలు, చొదిమెళ్ల, శనివారపుపేట, సత్రంపాడు, తంగెళ్లమూడి, వెంకటాపురం గ్రామ పంచాయతీలలో సుమారు ఆరు వేల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయని తెలిపారు. వారికి ఎటువంటి ఉపాధీ లేకపోవడంతో నగరాలకు, పట్టణాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పనుల కోసం వివిధ ప్రాంతాలకు ఆటోల్లో, లారీల్లోనూ ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలకు గురై కొంతమంది ప్రాణాలు కోల్పోయారని, మరి కొంతమంది వికలాంగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు కావాలని రెండేళ్ల నుంచి అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్‌, డ్వామా అధికారులు స్పందించి ఉపాధి హామీ పనులు కల్పించాలని, పేదలకు, దళితులకు న్యాయం చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులు పట్టణ ప్రాంత పేదలకూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జి దుర్గ, బి ప్రేమ కుమారి, బి నిర్మల, వనరాజ్యం, పి వజ్రం, లక్ష్మణుడు, బి పాప పాల్గొన్నారు.

➡️