వందే భారత్‌ మెట్రో ఏపీకే..!

May 2,2024 14:47 #AP, #Vande Bharat Metro

అమరావతి: భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. పలుమార్గాల్లో ఆక్యుపెన్సీ రేటు భారీగా ఉన్నది. ఇంట్రా-సిటీ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ తొలిసారిగా వందే మెట్రో రైలును ప్రవేశపెట్టబోతున్నది.
ఈ ఏడాది జులైలో ట్రయల్‌ రన్‌ నిర్వహించబోతున్నది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది. వందే మెట్రోని నడిపేందుకు మార్గాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి చెన్నై నగరాల మధ్య వందే మెట్రో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. దాంతో పాటు ఆగ్రా-మధుర, లక్నో-కాన్పూర్‌ మార్గాలను సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల వందే మెట్రో లుక్‌ బయటకు వచ్చింది.
వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వందే మెట్రో వంద నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. నగర ప్రయాణికులను దఅష్టిలో ఉంచుకొని వీటిని రూపొందిస్తున్నారు. రైలులో ఆటోమేటిక డోర్‌ సిస్టమ్‌ ఉండనున్నది. వందే మెట్రోలో నాలుగేసి బోగీలు ఒక యూనిట్‌గా ఉండనుండగా.. ఒక రైలులో కనీసం 12 బోగీలుంటాయి. రద్దీ అనుగుణంగా 16కి పెంచనున్నారు. తొలుత 50 మెట్రో రైళ్లు అందుబాటులోకి తేనుండగా.. వాటిని 400 వరకు పెంచాలని భావిస్తున్నది.

➡️