‘ఉక్కు’ ప్రయివేటీకరణ కుట్రలను తిప్పికొడతాం

May 18,2024 21:36 #Dharna, #visaka steel plant

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు కేంద్ర బిజెపి చేస్తున్న కుట్రలను, అందుకు సహకరిస్తూ స్టీల్‌ యాజమాన్యం చేపడుతున్న చర్యలను పోరాటాలతో తిప్పికొడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1192వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ ఇఎస్‌ఎఫ్‌, ఇఆర్‌ఎస్‌, ఇఎండి, సేఫ్టీ విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యాన్ని ఉపయోగించుకుని కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వివరించారు. ప్లాంట్‌ లాభాల్లోకి వచ్చే ప్రత్యామ్నాయ మార్గాలను మూసివేసి ప్లాంటును అమ్మాలని చూస్తున్న కేంద్ర కుట్రలను తిప్పికొడతామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఉపాధ్యక్షులు కె గంగాధర్‌ మాట్లాడుతూ స్థానిక స్టీల్‌ యాజమాన్యం కార్మికుల సహనాన్ని అలుసుగా తీసుకొని జీతాలు చెల్లించడంలేదన్నారు. ప్లాంటును పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపి అమ్మకాలను వృద్ధి చేయాలని కోరారు. ప్లాంట్‌ను నష్టపరిచే చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు గణపతిరెడ్డి, నాయకులు గోవిందు, సన్నిబాబు, రమణమూర్తి, ఆలీషా, ప్రసాద్‌, భాస్కర్‌, సుమన్‌ పాల్గొన్నారు.

➡️