‘గన్నవరం’ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

May 8,2024 22:46 #janasena pawan, #speech

– 25 రోజుల్లో కూటమిదే అధికారం
– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
ప్రజాశక్తి-ఉంగుటూరు (కృష్ణా) :గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో 25 రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే మెగా డిఎస్‌సి ప్రకటిస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుకతో పాటు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని, రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసిన అధికారులను ఎలక్షన్‌ కమిషన్‌ మారిస్తే అధికార పక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అభివృద్ధి, సంక్షేమం సమంగా చూస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్‌ అవినీతికి జడిసి పారిశ్రామికవేత్తలు పారిపోయారని ఆరోపించారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మల్లవల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బందరు ఎంపి అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని, నూజివీడు అభ్యర్థి పార్థసారథి, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాదును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ, జిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️