పాడైపోయిన కోవిడ్‌ టెస్టుల బస్సు – పట్టించుకునేదెవరు ?

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : కోవిడ్‌-19 సమయంలో కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నరసాపురం పట్టణానికి అన్ని వసతులతో కూడిన బస్సును అందించింది. కరోనా సమయంలో నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలకు బస్సులో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడానికి ఈ బస్సును ఎంతగానో ఉపయోగించారు. కొన్ని రోజులకు ఈ బస్సును వలంధర్‌ రేవు సమీపంలో మున్సిపల్‌ పాఠశాల వద్ద ఉంచారు. కరోనా టెస్టులు ఆర్టీపీసీఆర్‌, రాపిడ్‌ టెస్టులు నిర్వహించేవారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా అక్కడే నిలిపివేశారు .ఆ తర్వాత పట్టణానికి చివర 25 వార్డులో ఓ లే అవుట్‌ లో బస్సును ఉంచారు. దాదాపు 4 ఏళ్ల నుండి ఈ బస్సును ఇలాగే వదిలేయడంతో ఈ బస్సు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. లక్షల రూపాయలు విలువ చేసే బస్సు పై అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఈ బస్సు ధ్వంసమైంది. గత ఏడాది పలు అభివఅద్ధి కార్యక్రమాలలో పాల్గనడానికి వచ్చిన సిఎం జగన్మోహన్‌ రెడ్డి సభ కూడా ఈ స్థలం పక్కన జరిగింది. అయినా అధికారులు మాత్రం అప్రమత్తం కాలేదు. బస్సు అక్కడే ఉంది. బాధ్యత వహించాల్సిన అధికారులు బస్సు ధ్వంసమయ్యి పాడైపోతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రజా సొమ్ము పాడైపోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎండకు కలి, వానకు తడిచి బస్సు పూర్తిగా పాడయ్యేలోపు బస్సును సురక్షిత ప్రదేశానికి తరలించాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై జిల్లా వైద్య శాఖ అధికారి డి.మహేశ్వరరావును వివరణ కోరగా దీనిపై తనకు తెలియదని ఆరా తీస్తానన్నారు.

➡️