సిఎం వస్తే సిపిఎం నేతల నిర్బంధమా..?

Feb 21,2024 11:04 #cpm leaders, #House Arrest, #Visakha
Will the CPM leaders be arrested if the CM comes?

ఆగ్రహించిన సిపిఎం

ప్రజాశక్తి-విశాఖ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ వస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి. జగన్ లను ప్రభుత్వం గృహ నిర్బంధం చేసింది. తెల్లవారక ముందే పోలీసులు వచ్చి నాయకుల ఇళ్ళను చుట్టుముట్టారు. ప్రభుత్వ నిర్బంధ చర్యలను సిపిఎం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి వస్తే సిపిఎం నేతలు ఇళ్ళ నుండి బయటకు రాకూడదా! ప్రజా సమస్యలపై రోజు వారీ కార్యక్రమాలు, నిరసనలు చేయనివ్వరా! నాయకులను గృహ నిర్బంధం చేస్తే ప్రజల నిరసనలు ఆగిపోతాయా? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు 90 శాతం పరిష్కరించామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, అంత బాగా పాలన ఉంటే ముఖ్యమంత్రి నిరసనలకు ఎందుకు భయపడుతున్నారని, నిర్బంధానికి ఎందుకు పూనుకోవాలని నిలదీశారు. దీనిని బట్టే జగన్ ప్రభుత్వ పాలన ప్రజా కంటకంగా ఉందని అర్థం అవుతోందని పేర్కొన్నారు. విశాఖలో ప్రజల సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రతిపక్షాలకు, ప్రజలకు, ప్రజా సంఘాలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కానీ ఇంటి నుండి కాలు బయటకు పెట్టేందుకు ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలను ఎలా స్వీకరిస్తుందని మండిపడ్డారు. ప్రపంచంలోనే భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం అని పాలకులు ఊదర గొడుతుంటారని,  ఈ ప్రజాస్వామ్యం కొద్ది మంది సంపన్నులకు తప్ప సామాన్య ప్రజలకు, ప్రతిపక్షాలకు అందని ద్రాక్షగా ఉందని ఆగ్రహించారు.

అధికార మదంతో ప్రజల గొంతు నొక్కి, ప్రతిపక్షాలపై నిర్బంధ చర్యలకు పూనుకున్న ఏ ప్రభుత్వము బ్రతికి బట్ట కట్టలేదని, ఇది చరిత్ర చెప్పిన సత్యమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గ్రహించాలని, నిర్బంధ చర్యలు ఆపకపోతే ఈ ప్రభుత్వానికి గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి, విశాఖపట్నానికి తీవ్ర ద్రోహం చేస్తోందని, విశాఖ ఉక్కును, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందని తెలిపారు. లక్షలాది మంది యువత ఉద్యోగాలను హరిస్తోందని ఆగ్రహించారు. రైల్వే జోన్, విభజన చట్ట హామీలు, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి చేతనైతే కేంద్రాన్ని నిలదీయాలని, ప్రజల, ప్రజా నాయకుల గొంతు నొక్కడం, నిర్బంధించడం ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

➡️