శిల్పా రవిచంద్రను గెలిపించండి .. ఆయన నాకు మంచి మిత్రుడు – సినీ హీరో అల్లు అర్జున్‌

ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌:నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి సినీ హీరో అల్లు అర్జున్‌ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో శనివారం అల్లు అర్జున్‌ సందడి చేశారు. స్థానిక మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ఆయన అభిమానులు, వైసిపి కార్యకర్తలు అల్లు అర్జున్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా రవి నివాసానికి ర్యాలీగా చేరుకుని అక్కడ సేద తీరారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్‌ మీడియాతో మాట్లాడుతూ శిల్పా రవి తనకు మంచి మిత్రుడని, తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, కేవలం వ్యక్తిగత స్నేహంతోనే తాను నంద్యాలకు వచ్చానని చెప్పారు. అతనితో తన కుటుంబానికి ఉన్న అనుబంధమే తనను ఇక్కడకు వచ్చేలా చేసిందన్నారు. రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిశోర్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, ఆదిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త వైసిపి ముఖ్య నాయకుడు రత్నబాబు చౌదరి పాల్గన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ అభిమానులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆక్కడకు భారీగా చేరుకొని హంగామా చేశారు. ముఖ్యంగా శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి ఇంటి ప్రాంగణం జన సంద్రాన్ని తలపించింది.
అల్లు అర్జున్‌, ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లఘించి, అనుమతి లేకుండా జనసమీకరణ చేసినందుకు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌పై, నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రపై పై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు.

➡️