ముఖ్యమంత్రికి నిరసన సెగ

-తాగు, సాగు నీటి కోసం ‘మేము సిద్ధం’ యాత్రను అడ్డుకున్న రైతులు, మహిళలు
– తిరిగి వైసిపి ప్రభుత్వం వచ్చాక సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని జగన్‌ హామీ
ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు జిల్లా), గుత్తి (అనంతపురం జిల్లా) :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. తాగు, సాగు నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను రైతులు, మహిళలు శనివారం అడ్డుకున్నారు. దీంతో, ముఖ్యమంత్రి బస్సు దిగి వచ్చి వారితో మాట్లాడి వారిని శాంతింపజేశారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన, తుగ్గలి, జన్నగిరి, ఎర్రగుడి తదితర గ్రామాల మీదుగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వెళ్తుండగా జన్నగిరి వద్ద రైతులు, మహిళలు ఈ బస్సును అడ్డుకున్నారు. సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో, బస్సు దిగి ముఖ్యమంత్రి జగన్‌ వారి వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. హంద్రీనీవా నుంచి ఈ ఏడాది జనవరిలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నీటిని విడుదల చేస్తారని, అయితే, జన్నగిరి చెరువుతోపాటు చాలా చెరువులకు నీరు చేరలేదని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాగు, సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, వ్యవసాయం సాగక ఉపాధి కరువై వ్యవసాయ కార్మికులతోపాటు రైతులకు కూడా వలసలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ, వైసిపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో, రైతులు, మహిళలు శాంతించారు. కాగా, కర్నూలు జిల్లా గూడూరు మండలం కొత్తూరు (రామచంద్రాపురం)లో శుక్రవారం మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలతో సిఎంకు నిరసన తెలిపారు.
సిపిఎం నాయకుని అరెస్ట్‌
తుగ్గలి మండలం జన్నగిరి, దేశాయి తండాలలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు వినతి పత్రం ఇవ్వడానికి పేదలు, మహిళలతో వస్తున్న సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములును జన్నగిరిలో పోలీసులు అరెస్టు చేశారు. పేదలను, మహిళలను చెదరగొట్టారు. గత కొన్ని సంవత్సరాల నుండి దేశాయి తండాలో నీటి సమస్య విపరీతంగా ఉందని, ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి వెళ్తుంటే అరెస్టు చేయడం అన్యాయమని శ్రీరాములు అన్నారు. దేశారు తండాలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
ముఖ్యమంత్రి కాన్వారుపై చెప్పు విసిరిన ఆగంతకుడు
మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రి జగన్‌ కాన్వారుపైకి ఆగంతకుడు చెప్పు విసిరాడు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రోడ్‌ షో నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుత్తి బస్టాండ్‌ వద్ద జనం గుంపులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి విసిరిన చెప్పు ముఖ్యమంత్రికి దూరంగా వెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత నుంచి ముందు గార్డును పెట్టుకుని యాత్రను జగన్‌ కొనసాగించారు. చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

➡️